Thursday, November 14, 2024

TS: చత్తీస్ గ‌ఢ్ తరలిస్తున్న తెలంగాణ యూరియా

చెరుకూరు కేంద్రంగా అక్రమ యూరియా వ్యాపారం
మౌనం వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
వాజేడు, జూన్ 7 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర యూరియాను చత్తీస్ గ‌ఢ్ రాష్ట్రానికి తరలించి అక్రమంగా యూరియా వ్యాపారం కొనసాగిస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అనుముల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చెరుకూరు కేంద్రంగా ఈ అక్రమ యూరియా దందా గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది. అక్రమ యూరియా వ్యాపారాన్ని అరికట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు మౌనం వహించడంతో వారి వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వాజేడు మండలంలో 272 రూపాయలు ఉన్న యూరియా బస్తా చతిస్ గ‌ఢ్ రాష్ట్రంలో 450 రూపాయల నుండి 500 రూపాయల ధరకు విక్రయిస్తున్నారు.

చెరుకూరులోని వివిధ ఫెర్టిలైజర్ షాపుల వద్ద నుండి చత్తీస్ గ‌ఢ్ కు వందలాది ట్రాక్టర్ బోలోరా లోడ్లు ప్రతిరోజు అక్రమంగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు నోరు మెదపకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు సైతం అంతగా పట్టించుకోకపోవడంతో ఫెర్టిలైజర్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గత ఏడాది సైతం ఇలాగే తెలంగాణ యూరియాను చత్తీస్ గ‌ఢ్ కు తరలిస్తే ఇక్కడి రైతులకు యూరియా కొరత ఏర్పడి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎలాంటి పర్మిట్ పేపర్లు లేకుండా అక్రమంగా యూరియా బస్తాల లోడ్లను చ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రానికి తరలిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇక్కడి అధికారులు మంత్రి ఆదేశాలను బేఖాత‌ర్ చేస్తూ నిమ్మకు నీరెత్తిన‌ట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రం నుండి చత్తీస్ గ‌ఢ్ కు యూరియాను తరలిస్తున్న వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత రైతాంగం కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement