Friday, November 22, 2024

Telangana – పెద్దపల్లిలో పొలిటిక‌ల్ హీట్‌… మూడు పార్టీల మధ్య బిగ్ ఫైట్ …

రేపు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల నామినేషన్లు
వంశీకి మద్దతుగా మంత్రి, ఎమ్మెల్యేలు
కొప్పుల నామినేషన్ కు కేటీఆర్
బీజేపీ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ

పెద్దపల్లి (ఆంధ్ర ప్రభ) లోక్‌స‌భ ఎన్నికలు సమీపిస్తుండడంతో పెద్దపల్లిలో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. ఇక్క‌డి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు రోజుకో ఎత్తు వేస్తుండడంతో రసవత్తర రాజకీయం నడుస్తుంది. నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనా శుక్రవారం అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయ‌నున్నారు. బారస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించేందుకు గులాబీ నేతలు సిద్ధమయ్యారు. లోక్‌స‌భ పరిధిలోని ముఖ్య నేతలందరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రణాళికలు రెడీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మొదటి సెట్ నామినేషన్ శుక్రవారం దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి, పార్లమెంటు ఇన్చార్జ్ దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరుకాన్నారు.

- Advertisement -

బీజేపీ క్యాండెట్‌పై స‌స్పెన్స్?

ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థిగా ఎవరుంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను ప్రకటించారు. ఆయన కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్య నేతలు అందరూ గోమాస అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతోపాటు తాజా సర్వేల్లో చాలా వెనుకబడిపోవడంతో అభ్యర్థి మార్పుకు బీజేపీ అధిష్ఠానం సిద్ధమైంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ ఎస్‌ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా ఆయనకు ఆ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించలేదు. దీంతో పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయ‌న‌ను బీజేపీలో చేర్చుకుని అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వర్గీయులు చర్చలు కూడా పూర్తిచేసి వెంకటేష్ నేతను పోటీకి ఒప్పించారు.

నేడో రేపో వెంకటేష్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించే అవ‌కాశం ఉంది. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని వెంకటేష్ నేతకు ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే పెద్దపల్లిలో రసవత్తర పోరు ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు వెంకటేష్ నేత బరిలో ఉంటే పెద్ద పల్లి పార్లమెంట్ లో త్రిముఖ పోరు తప్పదని భావిస్తున్నారు. నేతకాని సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్ అభ్యర్థిగా ఉంటే ఆ వర్గానికి చెందిన మెజార్టీ ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉంది. దీంతో పాటు మాదిగ సామాజిక వర్గం కూడా వెంకటేష్ నేతకు మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడా టికెట్లు కేటాయించకపోవడంతో అధిక ఓటర్లు ఉన్న పెద్దపల్లిలో మాదిగ సమాజం ఎవరికి మద్దతిస్తారనే ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఇంత ఉత్కంఠ ఉంటే రాబోయే రోజుల్లో అధికార ప్రతిపక్ష పార్టీల నయా ఎత్తుగడలు ఇంకా ఎంత రసవత్తర పోరును కలిగిస్తాయో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement