Monday, November 25, 2024

Telangana Treasury – రాబ‌డిలో రిజిస్ర్టేష‌న్ టాప్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాకముందు రిజిస్ట్రేషన్ల రాబడి ఎంత అంటే రూ.1000 కోట్లు అనేది నాటి పాలకుల మాటగా ఉండేది. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి ఏడాది రూ.2707 కోట్ల నుంచి ఈ ఏడాది రూ.18 వేల కోట్లకు చేరింది. రాష్ట్రంలో వర్ధిళ్లుతున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం, వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో డిమాండ్‌ వంటివాటితో ప్రభుత్వానికి రాబడి మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా చేరుతోంది. సవరించిన మార్కెట్‌ విలువలు, స్టాంప్‌ డ్యూటీల సరళీకరణ, ఈ శాఖలో సంస్కరణలు, లీకేజీలు, అవినీతి నిర్మూలన వంటి చర్యల ఫలితంగా ఖజానా కళకళ లాడుతోంది. 2021-22లో 19.88 లక్షల లావాదేవీలు జరగ్గా ఇప్పుడు ఈ రికార్డును అధిగ మించేలా క్రయవిక్రయాలు రందుకుంటున్నాయి. దీంతో తొమ్మిదేళ్లలో రూ.5 వేల కోట్ల రాబడి ఈ ఒక్క శాఖ నుంచే ఖజానాకు చేరింది.

మారుమయూల ప్రాంతాల్లో కూడా పెరిగిన నీటిపారుదల వ్యవస్థ, భూగర్భ జలాల లభ్యత, ఉచిత నిరంతర విద్యుత్‌, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ చొరవ, రైతుబంధు, రైతుబీమా వంటి వాటితో వ్యవసాయ భూములకు భారీగా డిమాండ్‌ పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రజలే కాకుండా, ఇతర ప్రాంతాల ప్రజలు కూడా తెలంగాణలో తమ పెట్టుబడికి భూమికి మించిన మార్గం లేదనే అంచనాకు వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో స్థిరాస్తులపై దాదాపు రూ.15 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను పారించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఒక్క రిజిస్ట్రేషన్‌ రంగంలోనే రూ.15 లక్షల కోట్లకుపైగా నగదు వరదలా పారింది. ఇదంతా కేవలం ప్రభుత్వం నిర్ధేశించిన బుక్‌ వ్యాల్యూనే. అనధికారికంగా అయితే ఇది మరో 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అంటే దాదాపు ఐదేళ్లలో రూ.65 లక్షల కోట్లు ఈ రంగంలో పెట్టుబడులు పారినట్లుగా లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అభివృద్ధి తీరును గమనిస్తున్న పెట్టుబడిదారులతోపాటు సాధారణ ప్రజలు తమ పెట్టుబడులను స్థిరాస్తి రంగం వైపు మళ్లిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేళ్లూనుకుంటున్న అన్ని రంగాల అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పురపాలికలు వంటి ప్రత్యక్ష చర్యలు, ఇతర పరోక్ష కారణాలు కూడా భూములపై పెట్టుబడులకు మార్గమవుతోంది. తాజగా పెద్దనోట్ల రద్దు, ఇతర ఆర్థిక ఒడిదుడుకులు, బ్యాంకుల దివాళా, నగదు తిప్పలు, ఆర్థిక మోసాలకు గమనించిన సామాన్యుడు మొదలు బడా పెట్టుబడిదారుల వరకు తమ పెట్టుబడులకు భూమిని నమ్ముకుంటున్నారు. అందుకే తెలంగాణలో భూములు, ఆస్తులపై పెట్టుబడుల వరద పారుతోంది. వడ్డీలు, వ్యాపారాలు, ఇతర మార్గాలకంటే తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారానికి ఢోకా లేదని పెద్దపెద్ద సంస్థలూ భావించాయి. అందుకే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏకంగా రిజిస్ట్రేషన్‌ రాబడి రూపంలోనే గతేడాది రూ.18,787 కోట్ల రాబడి ఖజానాకు చేరింది.

ఆధునిక సాంకేతికత వినియోగంతో భరోసా
స్థూల ఆర్థిక వృద్ధిలో అపూర్వ ప్రగతి దిశగా అడుగులు వేస్తోన్న తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కీలక స్థానం ఉంది. యేటాటా రూ.4 వేల కోట్లకుపైగా రాబడినిస్తున్న ఈ శాఖ ప్రజల్లో దాదాపు ఏడాదికి రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ను చేతులు మార్చేలా చూస్తోంది. ఇ-చలాన్‌ మాడ్యూల్‌, సొంత నెటవర్క్‌తో సర్వర్‌ ఆధునీకరణ, మెరుగైన సేవలు, ఆధునిక సాంకేతికత, వీడియో రికార్డింగ్‌, ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌, ఇంటివద్దే సేవలు, పోస్టాఫీసుల్లో స్టాంపుల విక్రయాలు, ఆధార్‌ అనుసంధానం వంటి అత్యున్నత సేవలను అందిస్తూ పారదర్శకత, అవినీతిరహిత విధానాలను అవలంభిస్తోంది. తాజాగా ప్రతి డాక్యుమెంట్‌కు సబ్‌రిజిస్ట్రార్‌ బయోమెట్రిక్‌, ఆన్‌లైన్‌ స్టాంపుల విక్రయాల నమోదు, ఇతరత్రా విధానాలతో భారీగా రాబడి పెరగడంతోపాటు, ప్రజల్లో మోసాలకు అవకాశం లేని విధానంపట్ల భరోసా కల్పించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెరిగాయి.

- Advertisement -

గణనీయమైన వృద్ధి నమోదు
స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ గడచిన ఏడాదిలో కూడా గణనీయమైన వృద్ధిరేటును సాధించింది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో రియల్‌ రంగం దశ తిరిగింది. మార్కెట్‌ ధరకంటే ఎక్కువ ధరకు ప్రజలు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంతో భారీ రాబడి కూడా పెరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, నూతన ఐటీ పాలసీ, ఐటీఐఆర్‌, ఫార్మాహబ్‌, ఇతర పరిశ్రమల ఏర్పాటు ముమ్మరం కావడంతో రియల్‌ రంగంతోపాటు, స్థిరాస్తుల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఫార్మాసిటీ, ఐటీఐఆర్‌, ఇండస్ట్రీయల్‌ పార్కులు, రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణం వంటి చర్యలు రియల్‌ రంగానిికి మంచి రోజులనిచ్చాయి.

2012-13 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ శాఖ ద్వారా రూ.2819.31 కోట్లు ఖజానాకు రాబడి సమకూరింది. స్థిరాస్తులపై 6శాతం రిజిస్ట్రేషన్‌, స్టాంపు డ్యూటీలను ప్రభుత్వం వసూలు చేస్తుంది. అంటే దాదాపు రూ.1లక్షా 69వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులు ఆ ఏడాది ఈ రంగంలో పారిందని లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. అదేవిధంగా 2013-14లో రూ.2589.62 కోట్ల రాబడి, 2014-15లో రూ.2531.05 కోట్లు, 2015-16లో రూ.3096.97 కోట్లు, 2016-17లో రూ.3529.97 కోట్లు, 2017-18లో రూ.4222 కోట్లు ఖజానాకు చేరింది. 2022-23కి రూ.18 వేల కోట్లు దాటేసింది.

ఏడాది డాక్యుమెంట్లు(లక్షల్లో) రాబడి(కోట్లలో…)
2014-15 8.26 రూ.2707
2015-16 10.62 3786
2016-17 10.63 4249
2017-18 11.50 5177
2018-19 15.32 6612
2019-20 16.58 7061
2020-21 12.11 5260
2021-22 19.88 12364
2022-23 21.22 18606

Advertisement

తాజా వార్తలు

Advertisement