Friday, November 22, 2024

పట్టణీకరణలో ముందున్న తెలంగాణ, పట్టణాల్లో జీవన నాణ్యత భేష్ .. వెల్లడించిన నీతిఆయోగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : 2025 నాటికి తెలంగాణలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని, ఈ పట్టణీకరణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెండున్నర దశాబ్దాల ముందుందని దేశ అత్యున్నత ప్రణాళిక సంస్థ నీతిఆయోగ్‌ ఓ నివేదికలో తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని పట్టణజనాభా జాతీయ సగటు మొత్తం జనాభాలో 31.16 శాతంగా ఉందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణ మొత్తం జనాభాలో పట్టణ జనాభా 46.8 శాతంగా నమోదైందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ అంశంలో తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. దేశంలో పట్టణీకరణ అధికంగా మూడు రాష్ట్రాలలో ఉంది. ఇందులో తమిళనాడు మొత్తం జనాభాలో సగటున 48.45 శాతం పట్టణ జనాభాను నమోదు చేస్తే కేరళలో 47.23 శాతం నమోదైంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర 45.23 శాతంతో ఉంది. నగరాలను ఆర్ధిక వృద్ధి ఇంజన్‌లుగా పరిగణిస్తున్న నీతి ఆయోగ్‌ పట్టణ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాల ప్రభావం వాటి చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉపాధి ఆదాయ స్థాయిలలో బహుళ రెట్లు పెరుగుదలకు దారితీస్తుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిశీల పట్టణ విధానాలు, చొరవ వల్లే పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల సాధ్యమైందని తెలిపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పట్టణ స్థానిక సంస్థల సంఖ్యను 142కు పెంచారని తెలిపింది.

పట్టణ ప్రగతిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రస్తుత పట్టణ స్థానిక సంస్థలు మూడు శాతం కంటే తక్కువ భూ భాగాన్ని కలిగి ఉన్నప్పటికీ అదే ప్రాంతం రాష్ట్ర జీడీపీలో మూడింటరెండు వంతుల వాటాను అందిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఆర్ధిక కార్యకలాపాలు, విద్య, ఉపాధి అవకాశాలు ఆకర్షితులవడానికి ఒక కారణం. ఆరు సంవత్సరాలుగా జీవన నాణ్యత సూచికలో భారతదేశంలోని అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. 2025నాటినికి రాష్ట్ర జనాభాలో 50 శాతం జనాభా పట్టణాల పరిధిలోకి వచ్చే నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అంచనా వేశారు. కొనుగోలు శక్తి సూచిక, భద్రతా సూచిక ఆరోగ్య సంరక్షణ సూచిక, జీవన వ్యయం సూచిక, ఆస్తి ధర నుంచి ఆదాయ నిష్పత్తి సూచిక, ట్రాఫిక్‌ ప్రయాణ సమయ సూచిక, కాలుష్యం లేదా వాతావరణ సూచికలో వరుసగా హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలుస్తోందని నీతి ఆయోగ్‌ తన నివేదికలో తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement