Tuesday, November 19, 2024

Telangana – రాష్ట్ర ఖజానాలో కాసుల గ‌ల‌గ‌ల‌

రూ.1.51 లక్షల కోట్లకు పైగా ఆదాయం
ఫిబ్రవరి నెలాఖరు వరకు తేలిన లెక్కలు
పన్నుల రూపంలో 1.24 లక్షల కోట్లు
పన్నేతర ఆదాయం 20 వేల కోట్లు
జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా బారీ ఆదాయం
ఫిబ్రవరి వరకు ఖర్చుల లెక్కలివే

ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ఖజానాకు ₹1.51 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. పన్నుల రూపంలో ₹ 1.24లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా, ₹ 20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.7వేల కోట్లలోపు మాత్రమే గ్రాంట్లు రూపంలో సమకూరాయి. ఆర్థిక సంవత్సరంలో 11 నెలలు ముగిసే నాటికి ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 70శాతాన్ని, వ్యయం 75 శాతాన్ని అధిగమించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలలు ముగిసే నాటికి రాష్ట్ర బడ్జెట్ అంచనాలను 70 శాతం మాత్రమే అధిగమించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ – కాగ్​కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఖజానాకు ₹1,51,947 కోట్ల ఆదాయం సమకూరింది. బడ్జెట్​లో అంచనా వేసిన మొత్తం ₹2,15,566 కోట్లలో ఇది 70శాతానికి పైగా ఉంది. అందులో పన్నుల రాబడి ₹1,24,146 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో పన్ను ఆదాయం 81 శాతానికిపైగా చేరుకొంది.

పెద్దమొత్తంలో ఆదాయం

జీఎస్టీ ద్వారా రూ.42,441 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,980 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.27,467 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.18,927 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.14,955 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ.7,374 కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్ర పన్నుల్లో​ రాష్ట్ర వాటా బడ్జెట్​లో అంచనా వేసిన మొత్తం కంటే స్వల్పంగా ఎక్కువగా వచ్చింది. అమ్మకం పన్ను అంచనాలను 70 శాతంలోపే అందుకొంది. పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు అంచనా వేయగా ఫిబ్రవరి నెలాఖరు వరకు అందులో 91 శాతానికి పైగా రూ.20,845 కోట్లు ఖజానాకు చేరాయి. ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం రూ.41,448 కోట్లు. అన్ని రకాలుగా ఖజానాకు ఫిబ్రవరి నెలాఖరు వరకు వచ్చిన మొత్తం రూ.1,93,428 కోట్లు. బడ్జెట్ అంచనా అయిన 2,59,861 కోట్లలో ఇది 74 శాతానికి పైగా ఉంది.

ఖర్చుల లెక్క ఇదే..

ఖర్చు విషయానికి వస్తే ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం రూ.1,87,357 కోట్లు. బడ్జెట్ అంచనా రూ.2,49,209 కోట్లలో ఇది 75 శాతానికిపైగా ఉంది. వడ్డీ చెల్లింపుల కోసం రూ.20,844 కోట్లు, వేతనాల కోసం రూ.35,739 కోట్లు, పింఛన్ల కోసం రూ.15,344 కోట్లు, రాయతీల కోసం రూ.8,248 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రానికి ఫిబ్రవరి నెలలోనే అధికంగా పన్ను ఆదాయం వచ్చింది. 2023-24లో డిసెంబర్​లో పన్నుల ద్వారా రూ.12,609 కోట్లు ఖజానాకు రాగా ఫిబ్రవరిలో ఆ మొత్తాన్ని అధిగమించి ఏకంగా రూ.13,703 కోట్లు సమకూరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఫిబ్రవరి నెలలో రూ.1,111 కోట్లు వచ్చాయి. కాగా మార్చి 31వ తేదీనా 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement