హైదరాబాద్, ఆంధ్రప్రభ: మొదటి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి టాప్ వన్ స్థానంలో నిలవగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మరికొంత మంది విద్యార్థులు సైతం ఫలితాల్లో సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 (బీఈ, బీటెక్) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 14 మంది 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఏడుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండడం విశేషం. ఆ 14 మందిలోనూ మొదటి వరుసలో తెలంగాణకు చెందిన జాస్తి యశ్వంత్ వివిఎస్, మూడు, నాలుగు స్థానాల్లో అనికేత్ ఛటోపాధ్యాయ్, ధీరజ్ కురుకుంద ఉన్నారు. ఐదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొయ్యాన సుహాస్. 10, 11 స్థానాల్లో పెనికలపాటి రవికిషోర్, పొలిశెట్టి కార్తికేయ ఉన్నారు. అలాగే 14వ ప్లేస్‌లో తెలంగాణ విద్యార్థి రుపేశ్ బియాని ఉన్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన 14 మంది విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు నలుగురు ఉండగా, ముగ్గురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు. 100 పర్సంటైల్ మార్కులు సాధించిన మిగిలిన వారిలో హర్యాణకు చెందిన సర్తాక్ మహేశ్వరి, జార్ఖాండ్‌కు చెందిన కుశాగ్ర శ్రీవాస్తవ, పంజాబ్ నుంచి మ్రినాల్ గర్గ్, అస్సాం నుంచి స్నేహ పరీక్, రాజస్థాన్ నుంచి నవ్యా, కర్ణాటకకు చెందిన బోయహరేన్ సాత్విక్, ఉత్తరప్రదేశ్ నుంచి సౌమిత్రగర్గ్ టాప్ స్కోరర్లుగా నిలిచారు.
జూన్ 24 నుంచి 30 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1 పేపర్-1 పరీక్షకు 8,72,432 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 7.69 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 6న ఫైనల్ కీని విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్ పేపర్-1(బీఈ, బీటెక్) సంబంధించిన ఫలితాలను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసింది. త్వరలోనే పేపర్ 2ఏ(బి.ఆర్క్, 2బీ(బి.ప్లానింగ్) స్కోర్లను కూడా ప్రకటిస్తామని ఎన్టీఏ ఎక్జామ్స్ సీనియర్ డైరెక్టర్ తెలిపారు. ఈఏడాది తెలంగాణ నుంచి దాదాపు 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడత పరీక్షలకు హాజరయ్యారు.
రెండో సెషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మరోఅవకాశం…
ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న జేఈఈ మెయిన్ సెషన్-2కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు మరోకసారి ఎన్టీఏ అవకాశం కల్పించింది. రేపు (12న) రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అభ్యర్థులకు ఎన్టీఏ అధికారులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.