హైదరాబాద్, ఆంధ్రప్రభ : నకిలీ వైద్యుల ఆటకట్టించాల్సిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు సరైన కార్యాలయం లేకుండా పోయింది. కోఠిలోని వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయ భవన సముదాయాల్లో అందుబాటులో భవనాలు ఉన్నప్పటికీ ఒక మూలన, గుహలాంటి రేకుల షెడ్డులో కొనసాగుతోంది. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు, రెన్యువల్ కోసం వచ్చే వైద్యులు కూర్చునేందుకు కూడా వెయిటింగ్ హాల్ లేదంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌పై వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఏర్పాటైంది. జాతీయస్థాయిలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్నట్లే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటైంది. కౌన్సిల్‌లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరందరినీ తెలంగాణ ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. రాష్ట్రంలో ప్రయివేటు వైద్యుల ప్రాక్టీసులను నియంత్రించడం, నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదులను విచారిస్తుంది. అక్రమాలు తేలితే పోలీసులకు ఫిర్యాదు చేయడం, చర్యలకు సిఫారసు చేసే అధికారాలు కూడా కౌన్సిల్‌కు ఉంటాయి. రాష్ట్రంలో ప్రయివేటు ప్రాక్టీసు నిర్వహించాలంటే ఆ వైద్యులు తప్పకుండా మెడికల్ కౌన్సిల్‌లో తమ పేరును, ఆసుపత్రి పేరును నమోదు చేసుకోవాల్సిందే.
కౌన్సిల్ అనుమతి లేకుండా, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇష్టారీతిన ప్రయివేటు ఆసుపత్రులు పెట్టి ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతామంటే కుదరదు. అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు, వైద్యులపై కూడా రోగులు బోర్డుకు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదులను విచారించాక అక్రమాలు తేలితే బోర్డు ఆ వైద్యుడి ప్రాక్టీసుపై నిషేధం విధిస్తుంది. ఇంత కీలకమైన సేవలు అందించే తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు సరైన కార్యాలయ వసతి లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం కోఠిలోని ఓ మూలన, పాడుపడిన రేకుల షెడ్డులో కౌన్సిల్‌ను నిర్వహిస్తున్నారు. ఆ కార్యాలయంలోకి వెళితే ఓ గుహలోకి వెళ్లినట్లే అనిపిస్తోందని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల వైద్యులు హేళన చేస్తున్నారు. వివిధ పనుల మీద బోర్డు కార్యాలయానికి వచ్చే వైద్యులను ఆరు బయట టెంట్ వేసి కూర్చోబెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం వచ్చిందంటే వైద్యులకు ఆ టెంట్ కింద నిలవనీడలేకుండా పోతోంది.
టెంట్ కింద కనీసం ఫ్లోరింగ్ కూడా లేదు. వర్షం వస్తే బురదమయమే. ఇది చాలదన్నట్లు బోర్డు కార్యాలయ సమీపంలోనే పాన్ షాప్, క్యాంటిన్‌కు అనుమతించారు. దీంతో ఆ పరిసరాలన్నీ సిగరేట్ పీకలు, చెత్తా చెదారం, డిస్పోజబుల్ టీ గ్లాస్‌లతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. చిన్న వర్షానికే కార్యాలయంలోకి నీరు చేరి కీలకమైన ఫైళ్లు తడిసిపోతున్నాయి. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక సమావేశ మందిరం కూడా లేకపోవడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వైద్య, ఆరోగ్యశాఖ విభజన అనంతరం కోఠిలోని వైద్య, ఆరోగ్యశాఖ భవన సముదాయాల్లో చాలా వరకు భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఆ భవనాల్లో ఒకదానిని తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు కేటాయించాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు జీ. శ్రీనివాస్‌ను పలువురు వైద్యులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..