Thursday, November 21, 2024

Asifabad: దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం.. సీఎం కేసీఆర్

ఆసిఫాబాద్, జూన్ 30 : ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మక విలువలతో ఆచరిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసిన కొట్నాక భీమ్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో 25 కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించి ఎస్.పి. సురేష్ కుమార్ ను చాంబర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, డి.జి.పి. అంజన్ కుమార్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్రసాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ కమిషనర్ గణపతి రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్, ఆసిఫాబాద్, బోథ్, మంచిర్యాల, ఆదిలాబాద్ నియోజకవర్గాల శాసనసభ్యులు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, నడిపెల్లి దివాకర్ రావు, జోగు రామన్నతో కలిసి ప్రారంభించి నూతన కలెక్టరేట్‌ భవనంలో నిర్వహించిన సర్వమత పూజలు, ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలెక్టర్‌ చాంబర్‌లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, అనేక సంస్కరణలతో అన్ని రంగాలలో జరుగుతున్న అభివృద్ధితో దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందన్నారు. జిల్లాల విభజనతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకొని ఎంతో అభివృద్ధి సాధించామని, అనేక సంస్కరణలతో ప్రజా సంక్షేమంలో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ సమీకృత కలెక్టరేట్‌ భవనం ద్వారా ఒకే చోట అందిస్తున్నామని, 52.2 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లాలో నిర్మించుకున్న సమీకృత కలెక్టరేట్ ను రాష్ట్రంలో 22వ సమీకృత కలెక్టరేట్ భవనంగా ప్రారంభించుకున్నామని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న త్రాగునీరు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందిస్తున్న సేవలతో ప్రజల ఆరోగ్య స్థితి గతులు మెరుగుపడ్డాయని తెలిపారు.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ కేంద్రంగా లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని, పట్టాలు అన్ని మహిళల పేరు మీద అందించడం జరుగుతుందని తెలిపారు. సాధారణ రైతుల తరహాలో పోడు భూముల రైతులకు నేటి నుండి రైతుబంధు పథకం వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. 1 లక్ష 51 మంది రైతులకు 4 లక్షల 6, ఎకరాల భూమి పోడు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గిరిజనేతరులు 75 సంవత్సరాలు సాగు చేసుకుంటున్నట్లుగా రుజువు చేస్తే వారిని అర్హులుగా గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో అటవీ భూములను ఆక్రమించారని గిరిజనులపై కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వమే అర్హులైన వారిని గుర్తించి పోడు పట్టాలు పంపిణీ చేసినందున గతంలో అర్హులపై నమోదు చేసిన కేసులను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. 300 కోట్ల రూపాయలు వెచ్చించి మారుమూల గ్రామాలలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలోని షెడ్యూల్డ్ తెగల రైతులకు చెందిన పొలాలకు సైతం త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గిరిజన ప్రాంతాలలో గిరి వికాసం పథకం కింద అర్హులైన రైతుల పొలాలలో విద్యుత్ మోటార్లు అందించడం జరుగుతుందని, దీని ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజల సౌకర్యం కోసం సమీకృత కలెక్టరేట్ తో పాటు రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తూ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు జిల్లాలో వైద్య కళాశాలను మంజూరు చేసి భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి లబ్ధిదారుడికి అందించడంలో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు చేసిన కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో అప్పటి ప్రభుత్వ బెదిరింపులను పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంస్థను అదే పేరుతో కొనసాగించడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల వారికున్న నిబద్ధత తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో చేపట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యుత్ కోతలు లేని తెలంగాణగా వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలకు 24 గంటలు నిరంతర విద్యుత్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజున దేశమే నివ్వెరపోయే విధంగా విద్యుత్ సరఫరాలో చేపడుతున్న చర్యలు విద్యుత్ శాఖ అధికారుల కృషి ఫలితమేనన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలతో విజయపథంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. అనంతరం జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలలో పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాలలో 1 వేయి 649 కోట్ల రూపాయలతో సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టి ఇప్పటికి 21 భవనాలను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. 22వ జిల్లాగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలకు పరిపాలన అతి చేరువలో ఉంటుందని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించి వ్యయప్రయాసలు ఓర్చి ప్రజలు ఇబ్బందులు పడేవారని, రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతతో జిల్లాల విభజన చేసి ప్రతి జిల్లాను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారని, ఈ క్రమంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయం ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించడం జరుగుతుందని తెలిపారు. తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చి గిరిజనుల సాధికారతకు కృషి చేయడం జరిగిందని, గిరి పుత్రులకు ఎంతోకాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని, దీనితో పాటు పట్టాలు పొందిన పోడు రైతులకు రైతుబంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 15వేల 519 మంది పోడు రైతులకు 47 వేల 138 ఎకరాలకు పట్టాలు అందించడం జరిగిందని, దేశంలోనే అత్యధిక పోడు పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్దిదారుడికి అందేలా అధికారులందరం సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement