మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం
మహిళలు సమాజ సృష్టికర్తలన్న మంత్రి సీతక్క
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆదుకుంటాం
తెలంగాణ పదో వార్షిక లీడర్‌షిప్ సదస్సు ప్రారంభం
మాదాపూర్ టెక్ మహీంద్రా క్యాంపస్‌లో కార్యక్రమం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
మహిళలు సమాజ సృష్టికర్తలు అని, వారిని చిన్నచూపు చూసే పరిస్థితి ఇంకా ఉండడం వల్లే వెనుకబడి ఉన్నారని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మాదాపూర్ లోని టెక్ మహీంద్రా క్యాంపస్ లో సీ2 ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సును సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా పురుషులే గొప్ప అనే భావన ఉందని, అయితే మహిళలు తక్కువ అనే ఆలోచన నుండి బయటపడాలని చెప్పారు. తాను కష్టాన్ని నమ్ముకుని పనిచేసానని, అందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రి స్థాయి వరకూ వచ్చానని అన్నారు.
ప్రశ్నించడం అలవర్చుకోవాలి
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించడం అలవర్చుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. పని చేసే చోట మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుందని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలని తెలిపారు. మీకు ఎదురవుతున్న సవాళ్లను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం చట్టాలు చేస్తామని చెప్పారు. పని ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి…
వ్యాపారాలు, వ్యాపారవేత్తలు పట్టణాలకే పరిమితం కాకూడదని, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దృష్టి సారిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తున్నారని, సవాళ్లు ఎదురైనప్పుడు పారిపోకోకుండా, చాలెంజ్ గా తీసుకొని మహిళలు నిలదిక్కుకోవాలని సూచించారు.