Saturday, January 18, 2025

Telangana Rising – సింగపూర్ లో రేవంత్ రెడ్డి బృందం బిజి బిజి …

స్కిల్ వ‌ర్సిటీకి.. ఐటీఈ ప్రోత్సాహం
స్కిల్స్ ట్రెయినింగ్‌కు సింగ‌పూర్ పాఠ్యాంశాలు
సింగ‌పూర్‌తో ఒప్పందం చేసుకున్న తెలంగాణ‌
ప‌లు అంశాల‌పై సీఎం రేవంత్ బృందం చ‌ర్చ‌లు
సింగ‌పూర్‌లో టెక్నిక‌ల్ వ‌ర్సిటీ సంద‌ర్శ‌న‌
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణకు స‌న్నాహాలు
యూనివ‌ర్సిటీతో ఒప్నంద ప‌త్రంపై సంత‌కాలు
ఆ దేశ విదేశాంగ మంత్రితోనూ రేవంత్ బృందం భేటీ
విస్తృత సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యంపై స‌హ‌కారం
సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తికి అంగీక‌రించిన సింగ‌పూర్ మంత్రి

సింగ‌పూర్, ఆంధ్రప్ర‌భ‌:
తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ బృందం ప‌ర్య‌టిస్తోంది. ఈ టూర్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను సీఎం రేవంత్ సందర్శించారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో రేవంత్ సంభాషించారు.

కుదిరిన కీల‌క ఒప్పందం..

- Advertisement -

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ సమక్షంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఈరోజు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ఆన్‌లైన్‌, క్యాంప‌స్ శిక్ష‌ణ‌..

సింగపూర్ ఐటీఈ.. పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా.. పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణను ఇస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఐటీఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది.

అక్క‌డి పాఠ్యాంశాలు తెలంగాణ‌లో..

పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు ఐటీఈలో నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షకులకు ఐటీఈతో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయూతో సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకడమిక్, అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్ , ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది.

సింగ‌పూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

అంత‌కు ముందు సీఎం రేవంత్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కూడిన బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్‌తో విస్తృత చర్చలు జరిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, స్థిరమైన హరిత ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను అందివ్వాల‌ని రేవంత్ బృందం కోరింది.. దీనికి సింగ‌పూర్ విదేశాంగ మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement