Saturday, September 14, 2024

Telangana – రేపు రేవంత్ కేబినెట్ భేటీ – రుణ మాఫీపై మంత్రుల‌తో సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినేట్ సమావేశం రేపు(శ‌నివారం) జరుగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్​ లో చర్చించనున్నారు. . విభజన చట్టంలోని హెడ్‌ క్వార్టర్స్‌ అనే పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని తెలంగాణ అంటుండగా.. హైదరాబాద్​లోని సదరు కార్పొరేషన్ అన్ని కార్యాలయాలు, భవనాలను హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా, ఏపీ దీన్ని అంగీకరించలేదు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వీటిపైనే శనివారం జరగనున్న భేటీలో చర్చించనున్నారు.

రుణ‌మాఫీపై స‌మీక్ష
ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరుగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినేట్‌లో చర్చిస్తారు.

- Advertisement -

మేడిగ‌డ్డ నివేదిక‌పై చ‌ర్చ‌
కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది. స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు.

ఇరిగేష‌న్ అధికారుల‌తో స‌మీక్ష‌
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్‌డీఎస్ఏ) ఇచ్చిన నివేదికపై ఆ శాఖ అధికారుల‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. వర్షాకాలంలో బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్‌డీఎస్ఏ చేసిన సిఫార్సులు, ఇప్పటివరకు నీటిపారుదల శాఖ తీసుకొన్న చర్యలు, వర్షా కాలంలోగా చేయాల్సిన పనులపై సమీక్షించనున్నట్లు సమాచారం.

మరోవైపు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఈరోజు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఎన్‌డీఎస్ఏ సూచనలను అమలు చేయడం, బ్యారేజీ మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని ఒప్పందం ప్రకారం గుత్తేదారు భరించడం, దీనికి గుత్తేదారు అంగీకరించకపోతే ఏం చేయాలనే దానిపై సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. మరమ్మతులు చేసినా వరద స్వభావాన్ని బట్టి బ్యారేజీకి నష్టం వాటిల్లదని చెప్పలేమని ఎన్‌డీఎస్ఏ పేర్కొన్న నేపథ్యంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ స‌మీక్ష వివ‌రాల‌ను రేవంత్ కు ఆయ‌న వివ‌రించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement