హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని -ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంస్కరణలు ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయని, అవినీతికి ఆస్కారం లేకుండా ఉందని, ఇలాంటి విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని పంజాబ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం కితాబునిచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించింది.
బుధవారం మధ్యాహ్నం ముందుగా వల్లభనగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని, ఈసీ నకళ్లు తదితర విధానాల గురించి సబ్ రిజిస్ట్రార్ ముజీబ్ హుస్సేన్‌ని అడిగి తెలుసుకున్నారు. పంజాబ్‌కు చెందిన ఎస్‌హెచ్ మాన్వేష్ సింగ్ సిద్దూ, ప్రదీప్ సింగ్ రాష్ట్రంలో పర్యటించింది. వారు పలు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఓపెన్ ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల గురించి సబ్ రిజిస్ట్రార్లను, ధరణి ద్వారా జరుగుతున్న వ్యవసాయ రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విధానాల గురించి పలువురు తహసీల్దార్లను వారు అడిగి తెలుసుకున్నారు.
ముందుగా బేగంపేటలోని వల్లభనగర్ కార్యాలయానికి…
బేగంపేటలోని వల్లభనగర్ కార్యాలయానికి వచ్చిన ఐఏఎస్ అధికారుల బృందం గంటపాటు అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారుల వెంట తెలంగాణకు చెందిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సుభాషిణితో పాటు మోహన్ తదితరులు ఉన్నారు.
తెలంగాణలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల పనితీరును స్వయంగా పరిశీలించడం సంతోషంగా ఉందని ముజీబ్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంస్కరణలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేయడానికి మన రాష్ట్రానికి రావడం గర్వించదగ్గ విషయమని ఆయన తెలిపారు.