Thursday, November 21, 2024

తెలంగాణలో 72 సీట్లు మావే – రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మార్పు తథ్యం… కేసీఆర్‌ ఇంటిదారి పట్టడం అంతకంటే ఖాయం… మార్పు నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నాం… అద్భుత స్పందన వస్తోంది… 72 సీట్లలో కచ్చితంగా గెలుస్తాం… భారాస 25 సీట్ల లోపే ఉంటుంది… ఇక భాజపా సింగిల్‌ డిజిట్‌ దాటదు… ఈ రెండు పార్టీలు ఎంఐఎంతో కలిసి నాటకాలు ఆడుతున్నాయి… జనం గమనిస్తున్నారు… బుద్ధి చెబుతారు… మేం ఒంటరిగానే బరిలోకి దిగుతాం… ఎవరితోనూ పొత్తులుండవు… 60 శాతం అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశాం… వారంతా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు… దర్యాప్తు సంస్థలతో మోడీ, అవినీతి సొమ్ముతో కేసీఆర్‌ మళ్లి అధికారంలోకి రావాలని చూస్తున్నారు… ఈసారి వారి ఆటలు చెల్లవ్‌… ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మేం మా విధానాలను స్పష్టంగా ప్రకటిస్తాం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఏడాది చివరిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. మార్పే నినాదంగా ప్రజల్లోకి వెళుతున్నామని, కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని ఆయన పేర్కొన్నారు. హాత్‌సేహాత్‌ జోడో యాత్ర విజయవంతమవు తోందని, తొలివిడతలో ఆరు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలోని 40కి అసెంబ్లి నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతు ందని చెప్పారు. యాత్రలో భాగంగా గురువారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహి స్తున్న బహిరంగసభకు లక్షలాదిగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ప్రజల్లో భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న భ్రమలు తొలిగిపోయాయని , తనకుతానే అధికారాన్ని కోల్పోతు న్నామన్న విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. భారాసకు నూకలు చెల్లాయని, ఆ పార్టీ పట్ల ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనే విశ్వాసం సన్నగిల్లిందని, దీంతో వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని రేవంత్‌ ” ఆంధ్ర ప్రభ ” ప్రతినిధులకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

60శాతం సీట్లను ఇప్పటికే ప్రకటించాం…
అసెంబ్లిd ఎన్నికల్లో తమ పార్టీ తరుపున పోటీకి దిగుతున్న 60 నియోజకవర్గాల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించామని, వారంతా క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారని రేవంత్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసెంబ్లి ఎన్నికలకు ఆరు మాసాల ముందు 50శాతం టికెట్లను ప్రకటించాలని పార్టీలో జరుగుతున్న డిమాండ్‌పై స్పందించిన రేవంత్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు. ఉదాహారణకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీచందర్‌రెడ్డి, సంపత్‌, ఎర్ర చంద్రశేఖర్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌, నల్గొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ఖరారయ్యాని వారు హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో నిర్విరామంగా తిరుగుతూ పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు తీసుకవెళ్తున్నారని చెప్పారు.

త్రిముఖ పోటీ కాదు ద్విముఖ పోటీనే…
అసెంబ్లిd ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి మధ్యలోనే ఉంటుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. తమ పార్టీకి ఈ ఎన్నికల్లో 38 శాతం 42వరకు ఓట్లు వస్తాయని 72 నియోజకవర్గాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి ఈ దఫా అసెంబ్లిd ఎన్నికల్లో 28 నుంచి 32శాతం ఓట్లు వస్తాయని 25 అసెంబ్లిd సీట్లకు పరిమితమవుతుందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ 12శాతం ఓట్లను సాధిస్తుందని , ఎంఐఎం యథావిధిగా 3శాతం ఓట్లకు పరిమితమవుతుందని 7 నుంచి 8 స్థానాలు ఆ పార్టీకి వస్తాయని రేవంత్‌ చెప్పారు. ఉభయ వామపక్ష పార్టీలు ఇప్పటికే కనుమరుగయ్యాయని, ఈ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉంటుందని వివరించారు.

తెలంగాణలో బెంగాల్‌ తరహా రాజకీయాలు…
పశ్చిమబంగ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ , తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏ విధంగా కుమ్మక్కు, వ్యూహాత్మక రాజకీయాలకు పాల్పడ్డాయో అదే తరహాలో తెలంగాణలోనూ భారాస, భాజాపా అధికారంలోకి వచ్చేందుకు అడ్డదారులు వెతుకుతున్నాయని దుయ్యబట్టారు. 2018లో జరిగిన అసెంబ్లి ముందస్తు ఎన్నికలు ఆ తర్వాత ఏట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడబలుక్కుని పోటీకి దిగాయని, వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి కాంగ్రెస్‌ను అంతమొందించేందుకు ఈ రెండు పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా తెలంగాణ ప్రజలు విజ్ఞులని కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టి తామిచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమతో చేతులు కలుపుతారని రేవంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజాపా పోటీ చేసేందుకు సంఖ్యా బలం ఉన్నా ఎందుకు వెనక్కు తగ్గిందని ప్రశ్నించారు. ఇది కుమ్మక్కు రాజకీయం కాకపోతే మరేంటి..? అని నిలదీశారు. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ అసెంబ్లి లకు జరిగిన ఉప ఎన్నికల్లో భాజాపా డిపాజిట్లు ఎందుకు కోల్పోయిందని నిలదీశారు. హుజురాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికలో కేవలం అక్కడ పోటీ చేసిన అభ్యర్థులను చూసి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని , అది ఆ పార్టీ సత్తా అని అనుకుంటే అవివేకమవుతుందని పేర్కొన్నారు. కరోనాతో సతమతమవుతూ ఇంటికే పరిమితమైన తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై తప్పుడు కేసులు పెట్టి అయిదు రోజులపాటు ఈడీ ఆఫీసుకు పిలిపించి విచారించిన ఎన్‌డీఏ ప్రభుత్వం భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితకు సంబంధించిన లిక్కర్‌ స్కాం అంశంలో తన నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేయడాన్ని బట్టి చూస్తుంటే ఈ రెండు పార్టీలు ఎంతగానో చేయి చేయి కలిపి పనిచేస్తున్నాయన్న విషయం స్పష్టమవుతోందని చెప్పారు.

- Advertisement -

ఆరు మాసాల ముందే మా విధానాలను ప్రకటిస్తాం…
అసెంబ్లిd ఎన్నికలకు ఆరు నెలల ముందు తమ పార్టీ విధానాలను ప్రకటిస్తామని రేవంత్‌ చెప్పారు. ఇప్పటికే వరంగల్‌ వేదికగా తమ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారని, అందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అభయహస్తం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, రుణమాఫీ వంటి పథకాలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. తాము ఏం చేస్తామో అదే చెప్తా మని, సీఎం కేసీఆర్‌లాగా చేయని పనులను చెప్పమని , ప్రజలను మోస గించమని , దగా చేయమని పేర్కొన్నారు. తమ పార్టీ ఎంతో బలంగా ఉందని , రాష్ట్రంలో 43లక్షల సభ్యత్వాలు కలిగి ఉన్న పార్టీగా 36వేల594 పోలింగ్‌ బూతుల్లో 42వేల మంది సుశిక్షతులైన నేతలు ఉన్నారని చెప్పారు. అసెంబ్లిd ఎన్నికల్లో 80లక్షల ఓట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమకు ఇప్పటికే ఉన్న 43లక్షల సభ్యత్వంతోపాటు రెట్టింపు ఓట్లు సాధించి తీరుతామని , అందుకు అవసరమైన వ్యూహాలను, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మిగతా పార్టీల మాదిరిగా కాగితాలపై సభ్యత్వ నమోదు చేయలేదని, పతి ఇంటికి వెళ్లి వారి ఓటర్‌ కార్డును అప్‌లోడ్‌ చేసి వారి సమ్మతితోనే సభ్యత్వ నమోదు చేపట్టామని గుర్తు చేశారు.

వాళ్లనే ఓట్లు వేయమని కోరుతాం…
డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తానని మోసగించిన సీఎం కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో తిరస్కరించమని ప్రజలను కోరుతామని, ఇందిరమ్మ ఇళ్లను పొందిన లబ్దిదారులను కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేయమని కోరుతామని చెప్పారు. దళిత బందు పేరుతో మోసం చేసిన దళితులను అక్కున చేర్చుకుంటామని, ఫీజు రియంబర్స్‌మెంట్‌తో దగాపడ్డ కళాశాల యాజమాన్యాలను, విద్యార్థులను తమ పార్టీకి అండగా నిలబడి కోరుతామని, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించాలని అభ్యర్ధిస్తామని చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనను తొమ్మిదేళ్ల భారాస పాలనను బేరీజు వేయాలని , అలాగే పదేళ్ల యూపీఏ పాలనను పదేళ్ల ఎన్‌డీఏ పాలనను పోల్చాలని ప్రజలను కోరుతామని చెప్పారు. వ్యక్తిస్వామ్యంగా రాజకీయాలు నడిచే రోజులు పోయాయని, ఇకముందు ఈ తరహా రాజకీయాలు నడవవని చెప్పారు.

మందిరం కూలిస్తే కిషన్‌రెడ్డి నోరు మూగబోయింది…
పాత సచివాలయంలో మందిరాన్ని కూలిస్తే హైదరాబాద్‌ నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు..? అని , ఆయన నోరు మూగబోయిందని చెప్పారు. మందిరాల నిర్మాణానికి స్థలపురాణం ఉంటుందని చెప్పిన రేవంత్‌, అయోధ్యలో రామమందిరాన్ని ఎందుకు నిర్మిస్తున్నారని, తెలంగాణలో రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంటే ఆ మందిరాన్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. స్మశాన వాటికలకు వైకుంఠదామాలుగా పేర్లు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. శైవమతాన్ని అంతమొందించేందుకే కేసీఆర్‌ కుట్ర పన్నారని , శివుడికి నిలయమైన స్మశాన వాటికలకు స్వర్గదామం అని పేరు ఉండాలని చెప్పారు. భాష మీద, తెలంగాణ యాస మీద పథకం ప్రకారం కేసీఆర్‌ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాప్రాంతానికి చెందిన సినిమా షూటింగ్‌లు ఆపివేయించి , సినిమాల విడుదలను అడ్డుకున్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందిన సినిమాలను ఆదరిస్తూ ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఆరోపించారు. సచివాలయం ప్రాంతంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ను కూడా తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శాశ్వతంగా అన్ని వ్యవస్థలను విద్వంసం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, విపరీత పోకడలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

నా పాద‌యాత్ర‌తో బెంబేలెత్తుతున్న బిఆర్ఎస్

హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా తాను ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో పర్యటిస్తున్నానని , తన యాత్రలకు వస్తున్న జన సందోహాన్ని చూసి భారాస నేతల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లిలో తాను పాదయాత్ర చేసి బహిరంగసభ నిర్వహించి వచ్చాక భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీ రామారావు అక్కడ సభ నిర్వహించారని, ఇదే జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తన పర్యటన జరిగిన తర్వాత కేటీఆర్‌ వెళ్లారని చెప్పారు. తాజాగా మంత్రి కేటీ రామారావు బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో బహిరంగ సభ నిర్వహించారని ఈ నియోజకవర్గ పరిధిలో తాను ఇప్పటికే పర్యటించి వచ్చానని గుర్తు చేశారు. రేపోమాపో హుజురాబాద్‌, మనకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లో కేటీ రామారావు పర్యటించి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు.

ఏ పార్టీతో పొత్తు ఉండదు.. ఒంటరిగా బరిలో ఉంటాం..
అసెంబ్లిd ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవసరమూ, ఆవశ్యకత లేదని, ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని చెప్పారు. ఇంకితజ్ఞానం లేకుండా సీఎం కేసీఆర్‌ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్ట్‌ీతో సీట్ల సర్దుబాటు, పొత్తు పెట్టుకుంటామన్న సంకేతాలు ఇస్తున్నారని , లక్షల మంది కాంగ్రెస్‌ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి పదేళ్లపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన భారాసతో ఎటువంటి సంప్రదింపులు ఉండవని , ఈ విషయాన్ని తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అనేక వేదికలపై స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement