హైదరాబాద్, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖలోని 655 మందికి శర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ పథకాలను ప్రకటించారు. రవీంద్రభారతిలో శుక్రవారం ఈ పథకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ శాఖాపరమైన మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, వాహనాల కొనుగోలు, పోలీసు స్టేషన్ల భవనాల నిర్మాణం, పోలీసు సిబ్బంది నియామకాలకు పెద్ద ఎత్తున నిదులను కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.
శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, ఇందులో భాగంగానే డ్రగ్స్, పేకాట క్లబ్‌లు, మట్కాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వల్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించడానికి రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్న శాంతి భద్రతల పరిరక్షణే కారణమన్నారు. డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాంటిదన్నారు. నిరంతరం ప్రజా సేవలో విధులు నిర్వర్తించే పోలీసు శాఖకు సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పోలీసు శాఖ దేశంలోనే అత్యంత పటిష్టమైన శాఖగా రూపొందిందన్నారు. రాష్ట్ర ప్రజలకు మరింత సేవలను అందించేందుకు ప్రతి ఒక్కరూ ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని మరింత అంకిత భావంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసీబీ డీజీ అంజనీకుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అదనపు డీజీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.