హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోలీసు శాఖలో భారీ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రికార్డు సృష్టించిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. అంబర్‌పేటలోని సీపీఎల్ వద్ద పోలీసు ట్రాన్స్పోర్ట్ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వరుస పోలీసు నియామకాలతో పోలీసు శాఖలో మొత్తం యువ అధికారులతో రాష్ట్రంలో సమర్థవంతంగా శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 28500 నియామకాలు పూర్తి చేశామని, మరో 17500 నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక ప్రాదాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా పెట్రోల్ బంక్‌లు, ఫంక్షన్ హాళ్ళను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తున్నట్లు వివరించారు.
అంబర్‌పేట సీపీఎల్‌లోని పెట్రోల్ బంక్‌తో సహా మొత్తంనాలుగు బంక్లున్నాయని, వీటి ద్వారా పోలీసు శాఖ రవాణా విభాగంపై వత్తిడి తగ్గుతుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, కొత్త కమిషనరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, డీఎస్పీ శర్కిల్, పోలీసుస్టేషన్ల ఏర్పాటు ద్వారా పోలీసు శాఖ అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయడంలో సమర్థవంతంగా పని చేసిన అదనపు డీజీ సంజయ్జైన్ను, పీటీఓ ఎస్పీ రాజేష్‌ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ జితేందర్, జాయింట్ సీపీలు కార్తికేయ, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.