Sunday, November 24, 2024

Telangana – విడ‌త‌ల వారీగా రుణ‌మాఫీ … రేవంత్ ప్రభుత్వం కొత్త ఆలోచన

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఎలాగైనా రుణ మాఫీ చేసి తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ చేయాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. గడువు ముంచుకొస్తుందడంతో ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. జులై 15 నుంచి రూ.50వేల లోపు, ఆ తర్వాత రూ. 75వేలు, రూ.లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70% మందికి రూ. లక్ష లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది.

30వేల కోట్లు అవ‌స‌ర‌మని అంచ‌నా..

నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందట. ఇక అటు రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో రూ. 30 వేల కోట్లు అవసరమని ప్రభుత్వ వర్గాల అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్ ల అమలు సాధ్యమని సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో రూ. 8,246 కోట్లు సేకరించగా.. మరో రూ. 2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకొనుంది. ఈ ఏడాది కోటాలో మరో రూ. 30 వేల కోట్లు తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా..? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ

రైతుల రుణమాఫీ అమలు కోసం వృథాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదువపెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఇట్లయితే రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తనఖాపెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచన చేస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాల్లో 760 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. వీటి విలువ దాదాపు రూ.48 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా కనీసం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్​తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

సీఎం ముందు పలు ప్రతిపాదనలు..

ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధుల సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కార్ అన్వేషిస్తున్నది. ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ముందుంచింది. ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉండి క్రాప్​లోన్ల మాఫీకి అవసరమైన మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని మొదట భావించారు. కానీ ఈ అప్పును అదే కార్పొరేషన్​ నుంచి తిరిగి చెల్లిస్తే సమస్య లేదని, లేదంటే ఎఫ్ఆర్​బీఎం పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలను తీసుకోవాలని అధికారులు రెండో ప్రతిపాదనను సీఎం రేవంత్ ముందుంచారు.

ఎఫ్ఆర్ బీఎం పరిధిలోనే.. : సీఎం దృష్టికి అధికారులు

ఆర్బీఐలో కొన్ని నిబంధనల కారణంగా భూములను తాకట్టు పెట్టినా కూడా ఎఫ్ఆర్​బీఎం పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉందని పలువురు ఆఫీసర్లు సీఎం రేవంత్​దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వ భూములను తనఖా పెట్టినా ఎఫ్ఆర్​బీఎం పరిధిలోకి రాకుండా ఏం చేయాలనే దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించగా, ఆయా భూములను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుకునేలా ప్రపోజల్స్​రెడీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టీజీఐఐసీ దగ్గరున్న భూముల్లో గతంలో ఎకరా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పలికిన ల్యాండ్స్​ఉన్నాయి. ఆ రేటుకు అనుగుణంగా దాదాపు 200 నుంచి 300 ఎకరాలు వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా సుమారు రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవాలని రేవంత్ సర్కారు భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement