హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఆసర పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు సుమారు తొమ్మిది లక్షల యాభై వేల మంది ఎదురు చూస్తున్నారు. కొత్త దరఖాస్తుదారులే కాకుండా రెండేళ్ళ క్రితం వివిధ కేటగిరిల్లో దరఖాస్తు చేసిన వారు కూడా పింఛన్ల మంజూరు కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అప్పటి పాత నిబంధనల మేరకు 65 ఏళ్ళు నిండిన వాళ్ళు 2018 నుంచి 2020 డిసెంబర్ వరకు మొత్తం మూడు లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా, వారిలో ఒక లక్షా 20 వేల మందిని అర్హులుగా గుర్తించారు. ఎన్నికల సమయంలో సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కరోనా తదితర పరిణామాలతో మారుతున్న జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పొందేందుకు అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఈ ఏడాది ఆగస్టులో పింఛన్ దరఖాస్తులకు అవకాశం కల్పించగా, అర్హుల నుంచి దరఖాస్తులు భారీగా స్వీకరించారు. అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును అక్టోబర్ నెల వరకు పొడిగిం చారు.
దీంతో వృద్ధులు సహా ఆయా కేటగిరిల్లో పింఛన్ కోసం సుమారు తొమ్మి దిన్నర లక్షల పైగా కొత్త ఆసర దరఖాస్తులు అందాయి. మార్గదర్శకాల విడుదల జాప్యం వంటి వివిధ కారణాలతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యంగా ప్రారం భమైంది. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎంపిడివో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుల పరిశీలన ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నందున ఈనెలలో కూడా కొత్త పింఛన్ లు మంజూరు కావు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కొత్త లబ్ధిదారుల జాబితా ప్రకటించి, వచ్చే జనవరిలో పింఛన్ అందజేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39.36,521 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వారిలో ఆసర పథకం కింద వృద్ధులు సహా వివిధ కేటగిరిల్లోని లబ్ధిదారులకు నెలకు 2016 రూపాయలు, దివ్యాంగులకు నెలకు రూ.3016 అందజేస్తున్నారు. పింఛన్ పథకం కింద లబ్ధిదారులకు సుమారు రూ.12 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కొత్త పింఛన్ లబ్దిదారుల ఎంపిక పూర్తి అయితే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది.