Friday, November 22, 2024

Telangana – మున్నేరు వరదతో ఖమ్మం జిల్లా అతలాకుతలం

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు కొట్టుకుపోయి ఏపి, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రైల్వే ట్రాక్ లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు.భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 9మంది చనిపోయినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.

ఉప్పొంగిన మున్నేరు

- Advertisement -

ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి హెలికాప్టర్‌ను రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.

పునరావాస, రక్షణ చర్యలపై సీనియర్ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, వైద్య ఆరోగ్య శాఖ వంటి అత్యవసర శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి రంగంలోకి దించాలని, జిల్లాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకోవాలని టెలికాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించారు సీఎం..ఎంపీ, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు.

ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వరద ప్రవాహానికి రైల్వే పట్టాలకింద కంకర కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతినడంతో ఆ రూట్ లో రైళ్ల ను నిలిపివేశారు.మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన పలు రైళ్ల ప్రయాణీకులకు స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఆహారపదార్ధాలు, నీరు అందించారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ సికింద్రాబాద్ రైల్ నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు, పట్టాల మరమ్మతు, రైల్ సర్వీసుల పునరుద్ధరణపై చర్చించారు.అధికారులు విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను పూర్తిగా రద్దుచేయడం లేదా దారి మళ్లించడం చేశారు.

.జలదిగ్బంధంలో ఖమ్మం

ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టుముట్టింది. మున్నేరు నది ఉధృతంగా పారుతోంది. ప్రస్తుతం 27.5 అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి. ప్రకాశ్ నగర్ ప్రాంతం జలదిగ్బంధంలో ఉంది.

ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది ఉదయం నుండి చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చీకటి పడటంలో బ్రిడ్జిపైన చిక్కుకున్న వారి భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోమహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది.నెక్కొండ మండలం వెంకటాపురం సమీపంలో శనివారం రాత్రి నుండి 40 మంది ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోగా, ఈరోజు అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

తెలంగాణకు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో ఆయన పరిస్థితిపై ఫోన్ లో ఆరా తీసారు.ఎన్టీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయకచర్యల్లో పాల్గొనాలని సూచించారు.

భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరుతోంది. మేడిగడ్డ బరాజ్ కు 1.57 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లు 53వేల ఇన్ ఫ్లో వస్తుండగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలకు గాను 63 టీఎంసీల కు నిల్వ చేరింది.శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా , ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 20 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను 17 టీఎంసీలకు నిల్వ చేరింది.భారీ వర్షాల నేపథ్యంలో రేపు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement