హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన సీట్ల భర్తీకి షెడ్యూల్ సోమవారం అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతిలో, ఏడు నుంచి పదో తరగతుల్లోని ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 10 నుంచి ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు ప్రక్రియకొనసాగనుంది. హాల్టికెట్లను ఏప్రిల్ 8న డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 16న రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏడు నుంచి పదోతరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు.
మెరిట్ లిస్టును మే 2న ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు, సెలక్షన్ లిస్టును ఆయా మోడల్ స్కూళ్లకు మే 15న పంపిస్తామన్నారు. మే 22న లిస్టును ఫైనల్ చేసి అదే నెల 24న సీటు పొందిన విద్యార్థుల వివరాలను ప్రకటించనున్నారు. ధృవపత్రాల పరిశీలను మే 25 నుంచి 31 వరకు చేపట్టనున్నారు. తరగతులను జూన్ 1 నుంచి లేదా అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఓసీ వాళ్లకు దరఖాస్తు ఫీజు రూ.200 కాగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.125గా నిర్ణయించారు.