హైదరాబాద్ లోని సైదాబాద్‌లో హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని మాటిచ్చారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
చిన్నారి లేని లోటును తీర్చలేమని, అయితే ప్రభుత్వ పరంగా అన్ని విధాల కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి సత్యవతి చెప్పారు. చిన్నారి ఘటనపై ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని, నిందితున్ని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారని తెలిపారు. సీఎం కేసిఆర్ పాలనలో రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ కోసం అనేకమైన కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది దుర్మార్గులు అక్కడక్కడ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వారిపట్ల ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు.