ఇది కెసిఆర్ సాధించిన ఘనత
మెడికల్ కళాశాలలు పెరగడం వల్లే సీట్లు
తెలంగాణ బిడ్డలకు స్థానిక కళాశాలల్లోనే వైద్య విద్య
సీట్లు సాధించిన విద్యార్ధులకు హరీశ్ రావు అభినందనలు
హైదరాబాద్: వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా చేసిన ఘనత కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నీట్‌లో 3 లక్షలకు పైగా ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. బీసీ ఏ కేటగిరిలో 3.35 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు, బీసీ బీలో 2.27 లక్షలు, బీసీ సీలో 3.14 లక్షలు, బీసీ డీలో 2.13 లక్షలు, బీసీ ఈలో 2.24 లక్షల ర్యాంకులు సాధించిన వారికి ఎంబీబీఎస్ సీట్లు రావడం చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
మారుమూల ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడం, తెలంగాణ బిడ్డలు డాక్టర్ కావాలనే కలను స్వరాష్ట్రంలోనే ఉండి సుసాధ్యం చేసుకోవాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజిని కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 34కు పెరిగాయని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 20 నుంచి 60కి చేరాయన్ని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2850 నుంచి 8315లకు పెరిగిందని, ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు.
వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. రాష్ట్రంలో పెరిగిన మెడికల్ సీట్లను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, తెలంగాణాలో ఉంటూ వైద్య విద్య చదివి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.