తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఈ లీడర్లను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వారికి పట్టం కట్టారు. వీరిలో ఇ ద్దరు సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కాగా, మరో ఇద్దరు రఘునందన్, ఈటల రాజేందర్ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ దీటుగా ఎదుర్కొన్న ఈ నేతలకు ప్రధాని మోదీ చరిష్మా తోడైందని చెప్పవచ్చు.
పట్టు సడలని బండి
రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బీజేపీ నేత బండి సంజయ్ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి చవిచూశారు. అసెంబ్లీలో ఓటమి పాలైన బండి సంజయ్ ఏమాత్రం పట్టు సడలకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆర్నెళ్ల తిరక్కముందే తన సత్తా చాటుకున్నారు.
అరవింద్ స్థానం పదిలం
నిజామాబాద్‌లో సిట్టంగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ విజయం సాధించి తన స్థాన్నాని పదిలం చేసుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓటమి చవి చూశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 1.13లక్షలకు పైగా మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు.
.
25 ఏళ్ల తర్వాత కమలం
మంచి వాగ్ధాటి ఉన్న రఘునందన్ రావు మెదక్ లోక్‌సభ నుంచి విజయం సాధించారు. 25 ఏళ్ల తర్వతా ఈ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఆయన ఎగుర వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రఘునందన్‌రావు ఓటమి పాలయ్యారు. అయినా, ఆయన పై నమ్మకంతో బీజేపీ అధిష్ఠానం మెదక్ టికెట్ ఇచ్చింది. అధిష్ఠానం నమ్మకం వమ్ము కాలేదు.
ప్రజలతో మమేకం కావడంతో…
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల రాజేందర్ మల్కజ్‌గిరి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనకు ఉన్న రాజకీయ అనుభవంతో ప్రజలతో మమేకం అవ్వడంతోపాటు మోదీ చరిష్మా కూడా విజయానికి తోడ్పడింది.