Saturday, November 23, 2024

ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ టాప్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్ 2022 సంవత్సరపు క్యాలెండర్ ను, డైరీ ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం క్రింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 వేల 498 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ పథకం క్రింద కూలీలకు 2 వేల 381 కోట్ల రూపాయలు కూలీగా చెల్లించినట్లు చెప్పారు. గ్రామాలలో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు 1065 కోట్ల 60 లక్షల రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించామని మంత్రి వివరించారు.

సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం వల్ల ఎన్నో సత్ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఉద్యోగులు, ఉపాధి హామీ ఉద్యోగులు పథకం అమలుకు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామీణ పేదల ఉపాధికి తద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అమలు చేయబడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. కరోనా నేపథ్యంలో నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఇప్పుడు వాళ్లకు అవకాశం కూడా దక్కకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 98 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, 2022-23 ఆర్ధిక సంవత్సరం లో 73 వేల కోట్ల రూపాయలకు కుదించడం శోచనీయమైన విషయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement