తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతుంది. అటు పాలన విషయంలో ఇటు పథకాల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణపై అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువ సవరణపై అధికారులకు రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆదాయం పెంచే ప్రక్రియపై సీఎం .. సంబంధిత శాఖ అధికారులతో సచివాయలంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అభిప్రాయపడ్డారు. భూముల వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్దేశించిన భూముల మార్కెట్ విలువకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే ఇందుకు కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ కంటే భూముల వాస్తవ మార్కెట్ విలువ అనేక రెట్లు ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువను సవరించడం ద్వారా దీనిని హేతుబద్ధీకరించాలని ఆయన అన్నారు.
2021లో సవరణ
2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021 వరకు భూముల మార్కెట్ విలువను పెంచని రాష్ట్ర ప్రభుత్వం.. అవిభక్త ఏపీలో 2013లో సవరించిన మార్కెట్ విలువలు తెలంగాణలో 2021 వరకు ఎనిమిదేళ్లపాటు అమల్లో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీని తెలంగాణలో మొదటిసారిగా జూలై 2021లో పెంచింది. ప్రభుత్వం మళ్లీ ఫిబ్రవరి 2022 నుండి భూముల మార్కెట్ విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రెండవసారి పెంచింది. అయినప్పటికీ, భూముల వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వ భూముల విలువలకు మధ్య భారీ అంతరం ఉందని సీఎం భావించారు.
ఏడాదికి ఒకసారి సవరించాలి..
నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందని.. ఆ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని సీఎం రేవంత్ తెలిపారు. స్టాంప్ డ్యూటీ తగ్గించడమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యాయనం చేయాలని అధికారులకు సూచించారు.
సీఎం ఆదేశాలు
వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లకు ధరలను సవరించాల్సిన ప్రాంతాలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాస్త్రీయంగా, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నిబంధనల ప్రకారం ధరల సవరణను పాటించాలని తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు భూముల మార్కెట్ ధరలను సవరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
3
ఉద్యోగుల కొరత ఉండొద్దు
మరోవైపు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల కోసం అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలని తెలిపారు. మరోవైపు.. సామాన్యులకు ఇసుక కొరత రాకుండా అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పుంజుకోవడమా.. పడిపోవడమా?
సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉంది. భూముల మార్కెట్ విలువ సవరణపై తీసుకునే నిర్ణయం.. రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవటామా.. మళ్లీ పడిపోవటామా అనేది ఆధారపడి ఉంది. అయితే.. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఆ రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏమవుతుందన్నది పూర్తి పట్టు ఉండే అవకాశం ఉంది. దీంతో.. రియల్టర్లందరూ.. సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
జీఎస్టీ ఎగవేతపై సీరియస్
జీఎస్టీ ఎగవేతపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులలో జీఎస్టీ ఒకటి కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక నుంచి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పన్నుల వసూళ్లపై తనిఖీలు నిర్వహించి జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచనున్నారు. జీఎస్టీని సకాలంలో చెల్లించాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి, పన్ను ఎగవేతదారులు నిజాయితీగా చెల్లించాలని హెచ్చరించారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్‌లో ఎలాంటి అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు.
టార్గెట్లు చేరుకోవాలి..
మరోవైపు.. ఎన్నికల సీజన్లో మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యం మేరకు ఆదాయం పెరగకపోవడానికి గల కారణాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గతేడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడానికి, అధికారులు నెలవారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆదాయాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు