ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్: ఈనెల 24న తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్‌కు తెలియజేస్తానని చెప్పారు. తెలంగాణ భవన్ లో నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, మహిళా ఎమ్మెల్యేలను సీఎం, కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు కేటీఆర్ చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని ఆయనకు సూచించింది. ఈ మేరకు కమిషన్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది.
రుణం తీరలే.. బతుకు మారలే!
ఒకే విడతలో చేస్తామన్ని ₹2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదిస్తే బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తగ్గేదే లేదని, నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు. రైతు రుణాలు ₹49,500 కోట్లు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) తెలిపిందని, రాష్ట్రం మంత్రివర్గ భేటీలో ₹31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే.. బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం ₹26 వేల కోట్లేనన్నారు. మూడు విడుతల్లో ఇచ్చింది ₹17,933 కోట్లు మాత్రమేనని విమర్శించారు. అయినా.. రుణం తీరలే.. రైతు బతుకు మారలేదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.