Friday, January 24, 2025

Telangana – కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ ర‌ద్దు…

హైదరాబాద్‌: గోదావరి ఫేజ్‌-2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు గత ప్రభుత్వం డిజైన్ చేసిన పనులను నిలిపివేసింది. ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ విభాగం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఆ ఖర్చుతో గోదావరి ఫేజ్- 2 స్కీంను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, గ్రేటర్ సిటీ అవసరాలకు తాగునీటిని అందించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతోపాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు పనులకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని జలమండలి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -

పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవాపురం చెరువును నింపుతారు. కేశవాపురం చెరువులో 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌గా నిర్మిస్తారు. అక్కడి నుంచి ఘన్​పూర్​ మీదుగా హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీటిని అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఆరేళ్లు గడిచినా ఈ పనులు ప్రారంభంకాలేదు. గతప్రభుత్వంలో భూసేకరణ చిక్కులతోపాటు అనాలోచితమైన అలైన్‌మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి తాగునీటి సరఫరాతోపాటు ఉస్మాన్​ సాగర్​, హిమాయత్​ సాగర్​ నీటిని నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్‌మెంట్ ప్రకారం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement