- ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీసీల మహాసభ
- కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్
- 42శాతం రిజర్వేషన్ ఇచ్చిన అనంతరం లోకల్ ఎలక్షన్స్
హైదరాబాద్ – ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేడు ఇందిరాపార్క్‌లో నిర్వహించిన బీసీ సంఘాల మహాసభలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ… మహాత్మా జ్యోతిబాపూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జన్మదినమని, దేశంలోని ఆడబిడ్డలందరికీ నేడు పండగ దినమని కవిత చెప్పారు. సావిత్రబాయి పూలే పులిబిడ్డ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సావిత్రిబాయిపూలే ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు కవిత. చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని పేర్కొన్నారు. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బీసీలకు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు.
చాలా మంది కులం లేదని, కులరహిత సమాజం నిర్మిస్తామని గొప్పగొప్ప మాటలు చెప్తారని అంటూ కానీ, భారతదేశంలో కులాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కులాల ఆధారంగానే జీవిస్తున్నారన్నారు. అందుకే రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు. వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ కు దేశ ప్రజలందరూ చేతులెత్తి మెుక్కలన్నారు కవిత. ఆయన హక్కులు కల్పించకపోతే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికీ ఎటువంటి ఫలాలు దక్కేవి కాదన్నారు. అలాగే బీసీలోని అన్ని కులాలకు రాజ్యాంగంలో రక్షణ కల్పిస్తే బాగుండేందని అభిప్రాయపడ్డారు కవిత.
1953లో అప్పటి ప్రధాని నెహ్రూ బీసీలపై అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ వేశారన్నారు. పాపం ఆ పెద్దమనిషి రెండేళ్లు శ్రమించి రిపోర్టు ఇస్తే నెహ్రూ దాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యమని ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆమె హయాంలోనూ మండల్ కమిషన్ రిపోర్టును పదేళ్లపాటు బీరువాలో పెట్టారని విమర్శించారు. మండల్ కమిషన్ రిపోర్టును వీపీ సింగ్ అమలు చేస్తే ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టారని వివరించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పలేదా ? అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని” ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు కవిత.