Friday, November 22, 2024

అంతర్జాతీయ కంపెనీల గమ్యస్థానం తెలంగాణ: మంత్రి పువ్వాడ

అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌ నేడు స్టార్టప్‌లకు అడ్డాగా మారిందన్నారు. దేశంలో ఐటీ రంగం ప్రధానంగా విస్తరించిన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ గత ఆర్థిక సంవత్సరం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 7 శాతం వృద్ధి చెంది రూ.5 లక్షల కోట్లను తాకాయని వెల్లడించారు. టీ-హబ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటివరకు రూ. 2,000 కోట్ల పెట్టుబడులతో 1,100 లకుపైగా స్టార్టప్‌ల అభివృద్ధికి కృషి చేసిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ పట్టుదల, నిబద్ధతతో రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే వివిధ దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, సరళతరమైన ప్రభుత్వ నిబంధనల గురించి మంత్రి కేటీఆర్ వివరించడం ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు విశ్వాసాన్ని కలిగించడంతో ఆయా కంపెనీలు తెలంగాణకు తరలివచ్చాయన్నారు.

ఏడున్నరేండ్లలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు, ముఖ్యంగా టెక్‌ జెయింట్లుగా పేరొందిన అమెజాన్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఊబర్‌ తమ ద్వితీయ శ్రేణి కార్యాలయాలను అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసుకున్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధిరేటు 20.8%గా ఉంటే తెలంగాణ 79 శాతం వృద్ధి సాధించిందని పెట్టుబడుల ఆకర్షణ ఆయా ప్రాజెక్టుల అమలులో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. హైదరాబాద్‌ ‘బెస్ట్‌ లివబుల్‌ సిటీ’ ల్లో ఒకటిగా నిలిచిందని రానున్న రోజుల్లో తెలంగాణ దేశంలోనే ‘డెస్టినేషన్‌ స్టేట్‌’గా నిలవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement