Monday, November 18, 2024

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిక్సూచి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందన్నారు. సోమవారం తన కార్యాలయంలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ పోస్టర్స్‌, బ్రోచర్లను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆవిష్కరించారు. జగ్జీవన్‌ రామ్‌ 115వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను ఆయన తెలిపారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి జగ్జీవన్‌ రామ్‌ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని అన్నారు.

గత ఏడాది ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం రూ.67,787 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.93,489 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఇంటింటికీ తాగు నీరు అందుతుందని, కోటిన్నర ఎకరాలకు సాగునీళ్ళు పుష్కలంగా అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. చేపలు, గొర్రెలు, కోళ్ళు, బర్రెల పెంపకం పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాల ద్వారా ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్‌, ఏరోస్పేస్‌ రంగాలు మరింత దూసుకుపోతున్నాయని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement