Friday, November 29, 2024

TG | కేసీఆర్‌ పోరాటం వల్లే తెలంగాణ.. కేటీఆర్

  • పదేళ్లపాటు బంగారు పాలన
  • 420 హామీలతో అధికారంలోకి కాంగ్రెస్‌..
  • మరోసారి కదం తొక్కుదాం..
  • ప్రజల పక్షాన పోరాడుదాం..
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


కరీంనగర్‌, నవంబర్‌ 29 (ఆంధ్రప్రభ): కేసీఆర్‌ పోరాటాల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా అల్గునూరులో దీక్షా దివస్‌ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి శవయాత్రనా.. జైత్రయాత్రనా.. అంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగించడం వల్లే కేంద్రం దిగి వచ్చి ఆనాడు తెలంగాణ ఇచ్చిందన్నారు. 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్‌ పేరిట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండేదని, అప్పటి ప్రధాని నెహ్రూ 1956లో రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్‌ తప్పిదం వల్ల 1968 వరకు అణువణువునా తెలంగాణ అన్యాయానికి గురైందన్నారు. 1968 నుంచి 1971 వరకు తొలిదశ పోరాటం ఉధృతంగా నడిచిందని, 370 మంది అమరులైన అనంతరం 1971లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితికి ప్రజలు 11 ఎంపీ సీట్లను కట్టబెట్టారన్నారు.

ఎన్నికైన ఎంపీలను కాంగ్రెస్‌ ప్రలోభాలకు గురి చేసి ఉద్యమాన్ని నీరుగార్చిందన్నారు. 1971 నుంచి 2001 వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌, విద్యాసాగర్‌రావుతో పాటు కవులు, కళాకారులు, విద్యావంతులు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. 2001లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించి మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రారంభమైన నాడు కేసీఆర్‌కు మనీ పవర్‌, మజిల్‌ పవర్‌, మీడియా పవర్‌లాంటివి ఏమీ తోడు లేవని, కరీంనగర్‌లో సింహగర్జన ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. 2009 డిసెంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి ఉద్యమానికి ఊపుతెచ్చేందుకు ప్రయత్నించడంతో అల్గునూర్‌ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం ఆస్పత్రికి తరలించారన్నారు. శ్రీకాంతచారి ప్రాణత్యాగం చేశారని, పోలీస్‌ కిష్టయ్య బలిదానం చేసుకోవడంతో కేసీఆర్‌ చలించి పోయారన్నారు.

11 రోజులపాటు కేసీఆర్‌ ఆమరణ దీక్ష‌ చేపడితే పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో కేసీఆర్‌ దీక్ష విరమించారన్నారు. అయినప్పటికి ఐదేళ్లపాటు కాంగ్రెస్‌ మోసం చేయడంతో 1200మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం కేంద్రం దిగి వచ్చి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ పదేళ్లపాటు బంగారు పాలన అందించారన్నారు. రైతాంగానికి రైతుబంధు, పింఛన్ల పెంపులాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.

- Advertisement -

2023లో కాంగ్రెస్‌ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా హామీల అమలుకు మాత్రం పూనుకోవడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతుందన్నారు. ఆటో వాలా నుంచి రైతులు, మహిళలతో పాటు రాష్ట్రంలోని ఏ వర్గం ప్రభుత్వ తీరు పట్ల సంతృప్తితో లేదన్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడని, ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. ఏడాది గడవక ముందే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత‌ వచ్చిందన్నారు. నాలుగేళ్లపాటు ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. హామీల అమలు కోసం ప్రతీనిత్యం పోరాడతామని, దీక్షా దివస్‌ స్ఫూర్తిగా మరోసారి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మండలి వైస్‌ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement