Monday, September 16, 2024

Telangana – నిర‌స‌న‌లు తెలిపితే అరెస్ట్ లా… హరీశ్ ఫైర్

రుణ‌మాపి కాలేద‌న్న‌రైతుల‌పై పోలీస్ యాక్ట్
పలు జిల్లాల‌లో అరెస్ట్ లు, కేసులు న‌మోదు
మండిప‌డ్డ బిఆర్ఎస్ నేత హ‌రీశ్ రావు
న్యాయం అడిగితే గొంతు నొక్కుతారా
ఇదేనా మీరు చెబుతున్న ప్ర‌జాపాల‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్‌: రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని విమర్శించారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసు యాక్ట్ పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనని చెప్పారు.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని, అరెస్టులు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారని చెప్పారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు.

ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నాడని చెప్పారు. వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారని వెల్లడించారు. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎద్దేవాచేశారు. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారని చెప్పారు. అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement