హైదరాబాద్ – రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసి ప్రతి ఎకరానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడి.. రైతులకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు రైతుల కళ్లల్లో ఆవేదన.. కన్నీళ్లు చూశామని తెలిపారు. సత్తమ్మ అనే మహిళ నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని.. పైగా నాలుగు లక్షల రూపాయలు అప్పు అప్పు అయినట్లుగా ఆమె చెప్పిందని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అయితే ఒక్క గుంట కూడా ఎండ లేదని గుర్తుచేశారు. ఇప్పుడు కనీసం పట్టించుకునే నాథుడే లేడని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఆందోళనలో ఉన్నారని,.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ధైర్యం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని హరీష్ చెప్పారు. . ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులందరూ పంట పొలాల్లోకి వెళ్లాలనే కెసిఆర్ పిలుపుతో . గ్రామాల్లో మీ నియోజకవర్గాల్లో పంట నష్టం వివరాలు సేకరించి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరారు. . ఆ వివరాలు క్రోడికరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆర్థిక సాయం అందించే విధంగా ఒత్తిడి తేవాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. పంట పొలాల్లోకి వెళ్లినప్పుడు రైతులకు అండదండగా ఉంటామని బీఆర్ఎస్ తరపున ధైర్యాన్ని కల్పించాలి అని హరీశ్‌రావు సూచించారు.
మరో వైపు రైతు బంధు రాకపోవడం, కరెంట్ సరిగ్గా లేక మోటార్లు కాలిపోతుంటే కూడా పట్టించుకుని నాథుడే లేరన్నారు. ఇంకోవైపు వడగండ్ల వానతో తీవ్రమైన పంట నష్టం జరిగిందని తెలిపారు. దాదాపు 20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగినట్టు తెలుస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో అంచనా వేయడానికి, పరిశీలన చేయడానికి కూడా ముఖ్యమంత్రికి, మంత్రులు సమయమే లేదా? అని ప్రశ్నించారు. జిల్లా అధికారులనైనా పంపించి పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు.
పైగా మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు బ్యాంకర్ల వేధింపులు కూడా ఎక్కువయ్యాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో రైతులకు బ్యాంకులు నోటీసులు పంపి లోన్ కడతారా? లేదా? అని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం చేయగానే రుణమాఫీ చేస్తామని.. అది కూడా డిసెంబర్ 9నే చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.
ఏ ఒక్క హామీపై కూడా కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇక ఆరు గ్యారంటీలపై కూడా ప్రజలకు నమ్మకం లేదన్నారు. అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడుగుతారని నిలదీశారు. ముఖ్యమంత్రికి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడానికి.. వాళ్ల ఇళ్లకు వెళ్లడానికి సమయం ఉందని కానీ.. రైతుల సమస్యలను పట్టించుకోవడానికి లేదా? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలోని లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడి చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.