హైదరాబాద్, ఆంధ్రప్రభ : పేదల లబ్దికి శ్రీరామరక్ష… భూముల అభివృద్ధితో ఇరు పక్షాలకు రాబడి దిశగా సర్కార్ కార్యాచరణ చేస్తోంది. పేదలకిచ్చిన నిరుపయోగ భూములను ఇతర మార్గాల్లో అభివృద్ధిపర్చి డిమాండ్ సృష్టించడం, తద్వారా వారికీ, ఇటు సర్కార్‌కు ఉభయ రాబడి మంత్రంగా సర్కార్ అత్యుత్తమ ఆలోచన చేస్తోంది. ఇదే ఒరవడితో ఈ ఏడాది పన్నేతర ఆదాయార్జనకు సర్వం సిద్ధమవు తున్నది. నిరుపేదలకు రియల్ లబ్దితో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అద్భుత విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే ల్యాండ్ పూలింగ్‌తో పాటు, ప్రభుత్వ అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ మరోసారి తెరపైకి వస్తున్నది. ఇందుకు క్యాబినెట్ ఆమోదించిన ల్యాండ్ పూలింగ్ అంశాన్ని తెరపైకి తేనున్నది. పట్టణ ప్రాంతాల సమగ్ర ప్రణాళికాబద్ద
అభివృద్ధి, ఆర్ధిక స్వయం ప్రతిపత్తితోపాటు ఆర్ధిక స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన విధానానికి కసరత్తు చేస్తోంది. త్వరలో 20 పట్టణాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంతో నగరపాలికలు, పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కేంద్రాల్లో ఈ విధానం అమలుకు పూనుకుంటోంది. ఇప్పటికే హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 27 గ్రామాల్లో 21510 ఎకరాలను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పద్దతిలో ప్రైవేటు భూములను సేకరించి ప్లాట్లుగా అభివృద్ధిపర్చి అందులోనుంచి ఎకరాకు 1200నుంచి 2వేల గజాల వరకు భూ యజమానికి ఇచ్చేందుకు ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు గత ప్రతిపాదనలను పున: పరిశీలన చేస్తున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను సమీకరించి లే అవుట్లుగా అభివృద్ధిపర్చి అన్ని సదుపాయాలతో విక్రయించేందుకు యోచిస్తున్నది. 2500 ఎకరాల్లో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను వెంచర్లుగా అభివృద్ధిపర్చి రూ.10వేల కోట్ల సాధనకు వ్యూహం ఖరారు చేస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లనుంచి వివరాలను సేకరించింది.
సొంత లే అవుట్లు…
మరోవైపు ఇలా క్రమబద్దీకరణలతో ఆదాయార్జనకు వీలుండగానే ప్రభుత్వ భూముల విక్రయాలతో మరింత ఆదాయానికి ప్రభుత్వం స్కెచ్ వేసింది. ప్రభుత్వ భూములతోపాటు, ప్రైవేట్ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధిపర్చి విక్రయించాలని యోచిస్తోంది. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పక్కనే ఉన్న ప్రైవేటు భూములను గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చేల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 5 వేల ఎకరాలను ఇందుకు వీలుగా గుర్తించారు. ఇందులో డెవలప్‌మెంట్ కింద 2500ఎకరాలతో రూ. 10వేల కోట్లను పొందేలా ప్లాన్ వేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 1000ఎకరాల అసైన్డ్ భూములపై కూడా సర్కార్ దృష్టిసారించింది. వీటితో మరో రూ. 5వేల కోట్లను అంచనా వేస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంలో అమ్మకానికి వీలుగా ఉన్న 13వేల ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది.
ఇక అసైన్డ్ వంతు…
పట్టణాలు, నగరాలు, విలువైన ప్రాంతాలు, జాతీయ రహదారులకు సమీపంలోని అసైన్డ్ భూములపై సర్కార్ కన్నేసింది. విలువైన భూములతో రియల్ వ్యాపారం చేసేందుకు వెంచర్లుగా అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. సాగుకు యోగ్యంగా లేని భూములతో ఇటు ప్రభుత్వం అటు అసైనీలు లబ్ది పొందేలా ప్లాన్ వేస్తోంది. ప్లాట్లు, ఇండ్ల స్థలాలకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అసైన్డ్ భూములను అసైన్ లబ్దిదారుల అంగీకారంతో సమీకరించి వాటిని ప్లాట్లుగా అభివృద్ధిపర్చి వెంచర్లుగా వేసి మౌలిక సదుపాయాలు కల్పించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది. వెంచర్లుగా అభివృద్ధిపర్చిన భూమిలోనుంచి విస్తీర్ణాన్ని ఆధారంగా అసైనీకి ప్లాట్లను కేటాయిస్తారు. అసైనీనుంచి ఎకరం స్థలం సేకరిస్తే కనీసంగా 200 చదరపు గజాల స్థలాన్ని అసైనీకి పట్టా చేయాలని భావిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసైనీల డిమాండ్‌కు అనుగుణంగా కొంత ఎక్కువ స్థలం ఇవ్వాలని, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర జిల్లాల్లో 600 చదరపు గజాలు కూడా ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తోంది. ఎకరాకు 4840 చదరపు అడుగులలో 50శాతం రహదారులు, పార్కులు, ఇతర సౌకర్యాలకు పోనున్నది. ఇక మిగిలిన 2420 చదరపు గజాల్లో అసైనీ హక్కులు కోల్పోయిన రైతులకు గరిష్టంగా 600 చదరపు గజాలు ఇచ్చినా 1820 చదరపు గజాలపై ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఈ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తే ఖజానాకు భారీ రాబడి సమకూరనున్నది. పట్టణీకరణ, వేగంగా అర్భనైజేషన్, పెరుగుతున్న ప్లాట్ల ధరలు, అందుబాటులోలేని వసతుల కారణంగా ఇండ్లు కట్టుకునేవారికి డిమాండ్ పెరుగుతోంది.
ఇక్కడిక్కడ ఇలా వెంచర్లు….
పాగుభూమిలేని నిరుపేదలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గతంలో ప్రభుత్వాలు దశలవారీగా ప్రభుత్వ భూములను అసైన్ చేశాయి. ఈ భూముల్లో మెజార్టీ భూములు సాగుకు యోగ్యంలేనివే ఉన్నాయి. రాళ్లు, గుట్టలు, నీటివసతిలేని భూములు ఉండటంతో సాగు చేయకుండా పడావుగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను విక్రయించేందుకు వీలులేదు. ఈ నేపథ్యంలో ఇలా 24లక్షల ఎకరాల్లో దాదాపు 50శాతం భూములను అభివృద్ధిపర్చి ప్రజలకు, అసైనీలకు లబ్ది చేకూర్చితే ఎలా ఉంటుందని ప్రభుత్వం పరిశీలన చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లోని అసైన్డ్ భూములను ఇలా పరిశీలించినట్లు తెలిసింది. భూత్పూర్ మండల కేంద్రంలో 202 ఎకరాలు, జడ్చర్ల మండంలో 36ఎకరాలు, మరోచోట 77 ఎకరాలు, నందిగామలో 50 ఎకరాలు, వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపూర్‌లో 65ఎకరాలను, పెబ్బేరులో 44 ఎకరాలు, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ యోగ్యంకాని పట్టా భూములు 100 ఎకరాలు ఉన్నాయని గుర్తించారు. అసైన్డ్ భూముల సేకరణను ఖమ్మం రైతులు వ్యతిరేకించారు. సత్తుపల్లి, వైరా, కొణిజర్ల, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో తొలివిడతలో 842 ఎకరాలను గుర్తించగా, సేకరించిన భూమిలో 80శాతం సాగుదారులకే పట్టా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రంగరెడ్డి జిల్లా శ్కర్‌పల్లి, మోకిలాలో 600ఎకరాలు షాబాద్ మండలంలో 144 ఎకరాలు, మల్లాపూర్‌లో 42 ఎకరాలు, బోడుప్పల్‌లో 70 ఎకరాలను, నల్గొండ శివారులో 60 ఎకరాలుయాదాద్రి జిల్లా తుర్కపల్లిలో 110 ఎకరాలు, నిర్మల్ జిల్లాలోని మూడు మండలాల్లో 144 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 300 ఎకరాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 100ఎకరాలను గుర్తించారు.
అసైన్డ్‌పై ఇలా…
అసైన్డ్ భూములపై దృష్టిసారించిన సర్కార్ నిరుపేదలకు హక్కుల విషయంలో పునరాలోచన చేస్తోంది. తెలంగాణ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేద చట్టం -1977కు సవరణలు చేస్తేనే ఏదైనా చేసేందుకు వీలు కానున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎకరా రూ. 40లక్షలకు తగ్గడంలేదు. ఇటువంటి తరుణంలో పట్టణాల్లోని భూములకు హక్కులు కల్పిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీటిని నమ్ముకున్న పేదలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు పూలింగ్ విధానమే బెటర్ అని అంటున్నారు. అసైన్డ్ చేసిన భూముల్లో 40శాతం భూములు అసైనీల చేతుల్లో లేవని ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. రాష్ట్రంలో 15 లక్షలమందికి 24 లక్షల ఎకరాలను అసైన్డ్ చేశారు. వీటిలో సింహభాగం ఆక్రమణలు, విక్రయాలకు గురయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. భూముల ధరలు పెరగడం, వాటి పరిరక్షణ కష్టమైన నేపథ్యంతోపాటు, సాగు యోగ్యతలేని కారణంగా పరస్పర లబ్దితో పేదలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది.