హైదరాబాద్, : ప్రస్తుత సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభించిన పరిస్థితుల్లోనూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కలుగజేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయని, ఇతర సంస్థలు కూడా ముందుకు వచ్చి సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు గ్రీన్కో సంస్థ తెప్పించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కార్గో విమానానికి రాష్ట్ర సీఎస్ సోమేష్‌కుమార్, గ్రీన్ కో సంస్థ ప్రతినిధులతో కలిపి కేటీఆర్ స్వాగతం పలికారు. గ్రీన్కో సహ వ్యవస్థాపకులు అనిల్ చలమశెట్టి, కొల్లి మహేష్‌తో కలిసి విమానంలోని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పరిశీలిం చారు.ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక జరిగిన దురదృష్టకర సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకోలేదని తెలిపారు. ఆక్సిజన్, కొవిడ్ మందుల సరఫరాలో తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ముందుందని అన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం, ఇతర వైద్య సంస్థలతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు. పచ్చదనం, పరిశుభ్రతతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ప్రాజెక్టులను చేపడుతున్న రెన్యువబుల్ ఎనర్జీ గ్రీన్కో సంస్థ చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దిగుమతి చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం చుట్టు పక్కల ఉన్ననాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నందున ఆ మేరకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా వారు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలకతీతంగా అందరినీ కలుపుకుని పోతున్నామన్నారు. గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు అందించేం దుకు ఒక వెయ్యి కాన్సంట్రేటర్లను తీసుకురావడం, అందులో తొలిదశగా వచ్చిన 200 ఆక్సిజన్ కాన్సంట్రే టర్లను తెలంగాణకు ఇవ్వడాన్ని ఆయన కొనియాడారు. ఈ పరికరాలను చైనా నుంచి తెలంగాణకు తీసుకువచ్చేందుకు ఇండిగో సంస్థ సైతం తన ప్యాసింజర్ ఫ్లైట్‌ని ఉపయోగించి మరీ తీసుకురావడంపై ఇండిగో విమాన సంస్థకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్కో సంస్థ దిగుమతి చేసుకుని ప్రభుత్వానికి అందజేసిన ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఒక్కొక్కటి నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.