తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నజల వివాదాల విషయంలో లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కి తెలంగాణ మరో లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డిపిఆర్ లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారమే పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ 26.10.2021 న లేఖ రాశామని ఈ లేఖలో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం మరియు మోడికుంట వాగు ప్రాజెక్టులు కొత్తవి కాదని… ఉమ్మడి రాష్ట్రం ఆమోధించి ప్రారంభించిన ప్రాజెక్టులు కాబట్టి ఈ ప్రాజెక్టులు విభజన చట్టం క్లాజు 85 (8) (d) పరిధిలోకి కూడా రావని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీలలోనే భాగంగా ఉన్నాయని… ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ఏవిధమైన ప్రభావాన్ని కలిగించవని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం 15.07.2021 న జారీ చేసిన గజెట్ నోటిఫికేషన్ లో పైన పేర్కొన్న ప్రాజెక్టులను ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిందని తెలిపింది. వీటికి 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందాలని నిర్దేశించింది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఉమ్మడి రాష్ట్రం చేపట్టినవి కనుక ఈ ప్రాజెక్టుల డిపిఆర్ లలో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే పరిధి చట్టం ప్రకారం జీఆర్ఎంబీకి లేదు. ఈ అంశాలను పరిశీలించడానికి కేంద్ర జల సంఘం లో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయని స్పష్టం చేసింది.
కేఆర్ఎంబి గతంలో రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని పరిశీలించటానికి నేరుగా కేంద్ర జల సంఘానికి పంపించింది. డిపిఆర్ ల పరిశీలనలో రెండు నదీ బోర్డ్ లు భిన్నమైన పద్దతులను అనుసరిస్తున్నాయి. పూర్తి అయిన లేదా కొనసాగుతున్న ప్రాజెక్టుల డిపిఆర్ లకు సాంకేతిక అనుమతులు ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర జలసంగానిదే, బోర్డ్ లది కాదని పేర్కొంది. రెండవ ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా కేంద్ర జల శక్తి మంత్రి డిపిఆర్ లను త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారు. కాబట్టి గోదావరి ప్రాజెక్టుల డిపిఆర్ లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేధించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ వాయిస్.. నిజమైన బండి సంజయ్ జోస్యం!