Sunday, November 24, 2024

తెలంగాణలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటు

వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 13 మండలాలతో వరంగల్ జిల్లా, 14 మండలాలతో హన్మకొండ మండలాలను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవిన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాల స‌మ్మిళితంతో హ‌న్మ‌కొండ జిల్లా అవ‌త‌రించింది. 

ఈ క్రమంలో వరంగల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సమీక్ష నిర్వహించారు. ఇరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్వీభజనపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకొని చర్యలు చేపట్టాలని సూచించారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు కాకతీయుల చారిత్రక ప్రాశస్త్యం భవిష్యత్‌ తరాలకు అందించేందుకు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రులు చెప్పారు.

రెండు జిల్లాల పేర్ల మార్పునకు గత నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సూచనలను కోరుతూ నెల రోజులు సమయం ఇచ్చింది. ఇందులో 2027.89 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 9,63,975 జ‌నాభాతో వ‌రంగ‌ల్ జిల్లాగా.. 1466.23 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 8,35,420 జ‌నాభాతో హన్మకొండ జిల్లాలను ప్రతిపాదించింది. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రజల నుంచి సూచ‌న‌లు, అభ్యంత‌రాల‌ను స్వీక‌రించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా నుంచి 41, వ‌రంగ‌ల్ అర్భన్‌ జిల్లా నుంచి 92 అభ్యరంతరాలు, సూచ‌న‌లు వచ్చాయి.

హ‌న్మ‌కొండ జిల్లాలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క‌లుస్తుండ‌గా, స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందిన ధ‌ర్మ‌సాగ‌ర్‌, వేలేరు, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ర‌కాల‌, నడికుడ‌, దామెర మండ‌లాలు, హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భీమ‌దేవ‌ర‌ప‌ల్లి, ఎల్క‌తుర్తి మండ‌లాలు, హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌మాలాపూర్ క‌లిశాయి. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లాలు కూడా హ‌న్మ‌కొండ జిల్లాలోనే ఉన్నాయి.

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గీసుగొండ‌, ఆత్మ‌కూరు, శాయంపేట, సంగెం మండ‌లాలు, వ‌ర్ధ‌న్న‌పేట నియోజక‌వ‌ర్గం నుంచి వ‌ర్ధ‌న్న‌పేట‌, ప‌ర్వ‌త‌గిరి, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాయ‌ప‌ర్తి, న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాలు న‌ర్సంపేట‌, చెన్నారావుపేట‌, న‌ల్ల‌బెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్నాయి.

- Advertisement -

ఇది కూడా చదవండి: జానారెడ్డికి ప‌ట్టిన గ‌తే ఈట‌ల‌కు: తలసాని

Advertisement

తాజా వార్తలు

Advertisement