తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న‘దళిత బంధు’ పథకానికి సంబంధించిన రూ.250 కోట్లు విడుదల చేసింది. దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలానికి రూ. 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ. 50 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలోని ఒక్కొక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లు విడుదల చేయగా, లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఎంపిక చేసుకొనే పనిలో ఉన్నరు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లు విడుదల చేశారు.
ఈ పథకాన్ని మార్చి 2022 నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఏడాదికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపికచేయనున్నారు. దళితబంధు పథకం అమలు కోసం రానున్న బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు కేటాయించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital