తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 2024 జూన్ 2వతేదీ నాటికి పదేళ్లు పూర్తి కానుంది. ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడంలో తమదైన ముద్ర వేయాలని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం, మరో వైపు బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తున్నాయి. పోటాపోటీగా ఉత్సవాలు నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. ఈ సారి జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ అంతటా హీట్ పుట్టించనున్నాయి. ప్రధానంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్ర వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ అధికారిక గేయాన్ని, అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తూ ఆర్బాటం చేస్తోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీ రచ్చ చేస్తోంది.
పోటాపోటీగా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండులో ఘనంగా కార్యక్రమం చేపడుతుండగా, మరో వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అధికారికంగా రాష్ట్రప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటాపోటీగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నాయి. దశాబ్ది ఉత్సవాల శోభతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడనుంది.
వేడుకలకు సోనియమ్మ..
తెెలంగాణ రాష్ట్ర అకాంక్షను నెరవేర్చిన ఇండియా కూటిమి అధినేత్రి, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని వేడుకలకు రావాలని సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల చిరకాలవాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులోఆమె చొరవ, కృషిపై ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ గురించి వివరించారు. సోనియా వేడుకలకు రావడానికి అంగీకరించినట్లు రేవంత్ తెలిపారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో…
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్సులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఉద్యమకారులను సైతం సన్మానించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరేడ్ మైదానంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. గన్‌పార్క్ అమర వీరుల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించి, పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ గీతాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పోలీసు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున వేదికను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కార్యకర్తలను ప్రభుత్వం తరపున సన్మానించనున్నారు. వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ గ్రౌండ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కోసం భద్రతా బలగాలు కొన్ని వారాలుగా రిహార్సల్స్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఆక్టోపస్ బలగాలు, టీఎస్‌ఎస్పీ బెటాలియన్, ఏఆర్, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సిబ్బంది పాల్గొంటున్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు మూడు రోజుల పాటు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. జూన్ ఒకటో తేదీన గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వేడుకల సభ నిర్వహిస్తారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అదే రోజు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ మూడో తేదీన అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగరవేసి కార్యక్రమాలు జరపనున్నారు. ఆయా జిల్లాల్లోని ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేస్తారు. తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
చిహ్నం మార్పు.. భగ్గుమన్న గులాబీ శ్రేణులు
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని, రాష్ట్ర గీతం మార్చడంపై రగడ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి చారిత్రక చిహ్నాలు అయిన చార్మినార్ ను, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం పైన బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర చిహ్నంలో నుండి చార్మినార్, కాకతీయ కళా తోరణాన్ని తొలగించడంపై ఆందోళనలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది . ఈ క్రమంలో చార్మినార్ వద్ద నేడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. శతాబ్దాలుగా హైదరాబాద్ కు ప్రతిరూపంగా చార్మినార్ తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ ను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వేడుకల్లోనూ రచ్చ తప్పదా..
తెలంగాణ రాష్ట్ర చిహ్నం పైన, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం పైన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ వ్యవహారంలో రచ్చ కొనసాగుతుంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.