హైదరాబాద్, ప్రభన్యూస్ : జాతీయ అటవీ విధానం టాస్క్‌ఫోర్స్, వర్కింగ్ గ్రూపు కమిటీలలో తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియాల్‌కు స్థానం దక్కింది. దీంతో తెలంగాణ అటవీశాఖకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. జాతీయ అటవీ విధానం, అటవీ పరిరక్షణ చట్టం- 1980కి అవసరమైన మార్పులు, ఆగ్రోఫారెస్ట్రీకి ప్రోత్సాహాం, అడవుల బయట పచ్చదనం పెంపు కార్యచరణపై కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నేతృత్వంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్టు ఛైర్మన్‌గాను, మరో పద్దెనిమిది మందితో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మెజారిటీ సభ్యులు ఢిల్లి కేంద్రంగా పనిచేసే అడవులు, పర్యావరణం సంబంధిత శాఖలు, సంస్థల ఉన్నతాధికారులు ఉన్నారు. వారితో పాటు కమిటీలో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, అటవీ దళాల అధిపతి (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ) ఆర్. ఎం. డోబ్రియాల్‌కు స్థానం కల్పించారు. టాస్క్ ఫోర్స్ సూచనలను పరిగణలోకి తీసుకుని అమలు చేసేందుకు మరో వర్కింగ్ గ్రూప్‌ను కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో కూడా తెలంగాణ పీసీసీఎఫ్‌కు చోటు కల్పించారు. ఈ క్రమంలో జాతీయ స్ధాయిలో అటవీవిధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన రెండు ఉన్నతస్థాయి కమిటీల్లోనూ తెలంగాణ పీసీసీఎఫ్‌కు స్థానం దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణకు హరితహారం ద్వారా గత ఏడేళ్ళుగా రాష్ట్రం గణనీయమైన పచ్చదనం పెంపుతో పాటు అనేక వినూత్న పర్యవరణ హిత చర్యలను తీసుకుంది. దీనిని అనేక రాష్ట్రాలు మోడల్‌గా తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఉన్నతస్థాయి కమిటీలలో తెలంగాణకు చోటు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బలమైన సంకల్పంతోనే పచ్చదనం పెంపు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. జంగల్ బజావో-జంగల్ బడావో నినాదం, హరితనిధి ఏర్పాటు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. అందుకే జాతీయ ఉన్నతస్థాయి కమిటీల్లో తెలంగాణకు స్థానం దక్కిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో వివరించడంతో పాటు కొత్త అటవీ విధానం, అటవీ చట్టానికి మార్పు చేర్పులు మరింత పర్యావరణ హితంగా ఉండేలా టాస్క్‌ఫోర్స్ కమిటీతో కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. మే నెల 5న ఢిల్లిdలో జరగనున్న టాస్క్‌ఫోర్స్ సమావేశానికి హాజరవుతున్నట్లు డోబ్రియాల్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..