Thursday, January 30, 2025

Telangana – చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది – మంత్రి సీత‌క్క‌

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : చ‌దువుతోనే విజ్ఞానం పెరుగుతుంద‌ని పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క అన్నారు. గురువారం లక్డికాపూల్ లోని ఎఫ్‌టీసీసీఐ కార్యాలయంలో విద్యాధన్ స్వచ్ఛంద సంస్థ స్కాలర్ షిప్ ల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో అన్నింటికంటే ఉత్తమమైనది విద్య అని, విద్యతోనే వికాసం సాధ్యపడుతుంది అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చి 6-14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశ పెట్టింద‌న్నారు. విద్యను ఎవరు దోచుకోలేర‌ని, విద్య పంచుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.. ఆ ఉద్దేశంతో విద్యాధన్ ఫౌండేషన్ పని చేయడం అభినందనీయ‌మ‌న్నారు.

చ‌దువుకోవాల‌న్న ప‌ట్టుద‌ల ఉంటే…
చ‌దువుకోవాల‌న్న ప‌ట్టుద‌ల ఉంటే చాలు ఉన్న‌త విద్య నేర్చుకోవ‌చ్చున‌ని మంత్రి సీత‌క్క‌ అన్నారు. అందుకు త‌న జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ అని చెప్పారు. తాను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత పదేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాన‌ని, బయటకొచ్చిన తర్వాత తిరిగి విద్యార్థిగా చదువును కొనసాగించానని తెలిపారు. చదువుకోవాలన్న పట్టుదలతో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఏ, పీచ్డీ పూర్తి చేశాను అని చెప్పారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా విద్యను ఆపలేద‌న్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఎంఏ కోర్సును జాయిన్ అవ్వాలనుకుంటున్నాన‌ని చెప్పారు. మానవ విలువలను, సంబంధాలను పటిష్టం చేసే విద్యను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పేదలకు విద్య అందించే విద్యాధన్ ఫౌండేషన్‌కు త‌మ ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement