అదానీ డబ్బు తెలంగాణకు వద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… స్కిల్ యూనివర్సిటీకి అదానీ విరాళంపై సంచలనం నిర్ణయం తీసుకున్నామన్నారు. అదానీపై వివాదానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. స్పీకర్ ఓం బిర్లా కూతురు పెళ్లి కోసం ఢిల్లీకి వెళుతున్నామన్నారు.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి సమస్యలను వివరిస్తామన్నారు. అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల నిధులు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై అదానీ సంస్థకు నిన్ననే లేఖ రాశామన్నారు. తమ ఢిల్లీ పర్యటనలపై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. వాళ్లలా తాము ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి వెళ్లడం లేదన్నారు. కేసుల మాఫీలు, పైరవీల కోసం తాము ఢిల్లీ వెళ్లడం లేదన్నారు.