నిరాకరిస్తూ లేఖ పంపామన్న రేవంత్
స్కిల్ వర్సిటీకి ఎన్నో ప్రైవేటు సంస్థలు సాయం చేస్తున్నాయి
కేసులు మాఫీ, పైరవీల కోసం ఢిల్లీకి వెళ్లడం లేదు
స్పీకర్ ఓం బిర్లా కూతరు పెళ్లికి వెళ్తున్నాం
బీఆర్ ఎస్ హయాంలోనే అదానీకి ప్రాజెక్టులు కట్టబెట్టారు
విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఆంధ్రప్రభ , హైదరాబాద్ : తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కిల్స్ యూనివర్సిటికీ అదానీ సంస్థలు సీసీఎస్ కింద ఇచ్చిన ₹100 కోట్ల విరాళం తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అదానీ సంస్థలకు లేఖ రాసినట్టు చెప్పారు. జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్కిల్ వర్సిటీకి అన్ని సంస్థలు విరాళాలు ఇచ్చాయని, అలాగే అదానీ సంస్థ కూడా ఇచ్చిందని రేవంత్ చెప్పారు.
అదానీ వ్యవహారంతో తెలంగాణకు సంబంధం లేదు..
అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతోందని, ఇది అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అదానీ అంశంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోందన్నారు. అయితే అదానీ వ్యవహారంతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము కేసులు మాఫీ, పైరవీల కోసం ఢిల్లీకి వెళ్లడం లేదని చెప్పారు. కాగా, స్పీకర్ ఓం బిర్లా కూతురు పెళ్లికి ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిపారు. బీఆర్ ఎస్ పాలనలోనే అదానీకి అనేక ప్రాజెక్టులు కట్టబెట్టారని విమర్శలు చేశారు.
నేను ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతా…
తాను ఎన్ని సార్లయినా ఢిల్లీ వెళతానని, కేసుల మాఫీ కోసం కాళ్లు పట్టుకోవడానికి వెళ్లడం లేదని సీఎం రేవంత్ అన్నారు. తమ ఢిల్లీ పర్యటనపై కొందరు అవాకులు, చివాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కేంద్రం వద్ద ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్రమంత్రులను, ప్రధాని మోదీని కలవడానికి వెళుతున్నామని చెప్పారు. ఈ రోజు లోక్‌సభ స్పీకర్ కుమార్తె పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్నట్టు చెప్పారు. పెట్టుబడులపై బీఆర్ఎస్ విధానం ప్రకటించాలన్నారు. అదానీకి వంగివంగి నమస్కారాలు పెట్టింది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.