Sunday, November 24, 2024

Telangana – శాస్త్రీయంగానే జిల్లాల కుదింపు ప్ర‌క్రియ‌

పునర్విభజనపై సమీక్షకు త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్‌
అందులో సభ్యులుగా ఐదు కీలక శాఖల ఉన్నతాధికారులు
ఇప్పుడున్న జిల్లాలు 33 నుంచి 17కు తగ్గించేందుకు సూచనప్రాయ నిర్ణయం
గతానికి భిన్నంగా శాస్త్రీయ పద్ధతిలో విభజనకు అధ్యయనం
గరిష్టంగా ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు
ప్రస్తుతం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్
ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై సాంకేతిక, పరిపాలన సమస్యలు
ప్రజాపాలన ఫిర్యాదులు, అధికారుల రిపోర్టుల పరిశీలన
అన్ని అంశాలకు క్రోడీకరించాకే నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్

- Advertisement -

హైదారాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అధికార పగ్గాలు చేపట్టాక జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్‌ అంతర్గతంగా కొంత కసరత్తు పూర్తి చేసింది. పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 17 కుదించే విధానాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ఒక నివేదిక రూపంలో అందజేశారు. గత ప్రభుత్వంలో జరిగిన జిల్లాల పెంపు ప్రక్రియ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్.. ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో చర్యలు చేపట్టనున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అందులో సభ్యులుగా ఐదు కీలక శాఖల ఉన్నతాధికారులు కూడా ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టనున్నారు.

టెక్నిక‌ల్ ఇష్యూస్ త‌లెత్త‌కుండా..

పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం పాత 10 జిల్లాలకు తోడు 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటుతో రాష్ట్ర రూపు రేఖలే మారిపోయాయని అందరూ అనుకుంటున్నప్పటికీ సాంకేతికపరమైన సమస్యలు అనేకంగా ఉత్పన్నం అమవుతున్నాయి. పాత జిల్లాలు ఒక్కో చోట 5 జిల్లాలుగా విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తెలత్తాయి. పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ నాలుగు జిల్లాల పరిధిలోకి విస్తరించి ఉండడంతో ఎంపీ లాడ్స్ నిధులను ఖర్చు చేయడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తున్నాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి.

కొత్త జిల్లాకు పీవీ పేరు ఖ‌రారు..

ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలతో ఉత్పన్నమైన సమస్యలను, తదనంతర పరిణామాలను నిశీతంగా పరిశీలించిన కాంగ్రెస్.. జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు హామీ ఇచ్చింది. అంతేకాదు ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టోలో కూడా ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పీవీ నరసింహరావు పేరు పెడతామని.. జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని తాజాగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్వయంగా రేవంత్ రెడ్డి ముఖయమంత్రి హోదాలో హామీ ఇచ్చారు.

ఇబ్బందులను అధిగమించేందుకే ఈ నిర్ణయం

ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు ప్రారంభం కానున్నాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఇప్పటికే పలుసార్లు ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చలు జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

అధ్యయనం చేయనున్న జ్యుడిషియల్ కమిషన్‌

అదే తరహాలో ప్రస్తుతం ఉన్నతాధికరులు సభ్యులుగా, పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి అధ్యక్షతన జ్యుడిషియల్ కమీషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ కమిషన్ అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన సన్నిహిత వర్గాలతో చెప్పారు. జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని, సభలో చర్చించి తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది.

గతంలోనే ప్రకటించిన సీఎం రేవంత్‌..

జిల్లాల పునర్విభజనపై అధికారం చేపట్టిన కొత్తలోనే సీఎం రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టమైన వైఖరిని వెల్లడించారు కూడా. జిల్లాలను అసంబద్దంగా విభజించారని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పునర్విభజనపై కమిటీ వేసి కొన్ని జిల్లాలు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా లోక్ సభ ఎన్నికలు ముగియడంతో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న సూచనప్రాయ నిర్ణయం మేరకు 18 జిల్లాలను రద్దు చేస్తారని తెలుస్తోంది.

ఏపీ ఫార్ములాతో జిల్లాల కుదింపు?

తన మార్క్ పాలన ఉండాలన్న లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం జిల్లాల కుదింపు అంశం పైన స్పెషల్ ఫోకస్ చేస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో తన మదిలో వచ్చిన ఆలోచన మేరకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని 33 జిల్లాలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆఖరు ఏడాది ఒక ఫార్ములా ప్రకారం జిల్లాల సంఖ్య పెంచారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 13 ఉమ్మడి జిల్లాలు ఉండగా.. పరిపాలన సౌలభ్యం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు. పార్లమెంట్ నియోజకర్గాల వారీగా జిల్లాల సంఖ్యను 25కు పెంచారు. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గానూ ఒక్కో సెగ్మెంట్ పరిధిని ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు.

రద్దు కాబోయే జిల్లాలు ఇవే.

అనధికార వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణలో రద్దు కాబోయే పద్దెనిమిది జిల్లాలు పరిశీలిస్తే.. ఆ జాబితాలో మొత్తం పద్దెనిమిది జిల్లాలు ఉన్నాయి. వాటిలో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement