మరోవైపు రాష్ట్రంలో లోగో లొల్లి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో మార్పు వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అది రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని సర్కారు భావిస్తోందని బీఆర్ ఎస్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో సచివాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, . రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు వెల్లడించారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.
. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.