ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణ సాంస్కృతిక, వారసత్వ సంపద పరిరక్షణను ప్రజా ప్రభుత్వం ఒక బాధ్యతగా భావిస్తుందని, అందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని ప్రసిద్ద కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్దరణ విజయవంతంగా పూర్తయిన సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు
రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆగా ఖాన్ కల్చరల్ ట్రస్ట్ సహకారంతో ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ చేపట్టారు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు.. ఇలా వేల ఏండ్ల పాటు ఆయా రాజ్యాలు తెలంగాణపై తమదైనా ప్రత్యేక సాంస్కృతిక ముద్రను వేశాయని ముఖ్యమంత్రి అన్నారు.
*వీటితో పాటు వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు మన తెలంగాణ నిలయంగా ఉందని గుర్తుచేశారు. శతాబ్దాలుగా హైదరాబాద్ నగరం ‘గంగా-జమునా తెహజీబ్’గా బహుళ జాతులు, సంస్కృతుల మేళవింపుతో సామరస్యాన్ని, సహజీవనాన్ని చవి చూసిందని, ఈ సాంస్కృతిక వారసత్వం మనల్ని సగర్వంగా ఉంచుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పరిరక్షణలో అగా ట్రస్ట్ సహకారానికి, ఉదారతకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ప్రజల తరపున ముఖ్యమంత్రి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్, ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.