Friday, November 22, 2024

Telangana – పొలాల నుంచి క‌ద‌ల‌ని నీళ్లు – పంట‌ల‌కు తెగుళ్లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూస్ నెట్ వ‌ర్క్‌ :
భారీ వ‌ర్షాలు కార‌ణంగా ప‌లు జిల్లాల్లో పంట‌ల‌కు తెగుళ్లు సోకుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పది రోజుల పాటు కురిసిన వర్షాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో పొలాల నుంచి నీరు బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో పంట‌లు నాశ‌న‌మ‌య్యే ప‌రిస్థితి ఉంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. పదిరోజులకు పైగా నీరు నిలిచిపోయింద‌ని, పొలాల నుంచి నీరు పంపేందుకు రైతులు శ్ర‌మ ఫ‌లించ‌డం లేదు. ఈ ఏడాది దిగుబ‌డిపై కూడా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని రైతులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తెగుళ్ల నివార‌ణ‌కు వ్య‌వ‌సాయ శాఖ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు రైతులు కోరుతున్నారు.

ముంపు ప్రాంతాల్లో…

తెలంగాణ‌లో ఉమ్మ‌డి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్‌, న‌ల్లగొండ జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు, వ‌ర‌ద‌ల‌కు పొలాలు ముంపున‌కు గుర‌య్యాయి. సుమారు ప‌ది రో్జులకు పైగా పొలాల్లో నీరు నిలిచి ఉంది. ఇప్ప‌టికీ మ‌రికొన్ని ప్రాంతాల్లో వ‌రి, ప‌త్తి చేలు ముంపులోనే ఉన్నాయి. తెలంగాణ‌లో వ‌రి, ప‌త్తి అధికంగా సాగు చేస్తున్నారు. వీటితోపాటు మొక్క జొన్న‌, ప‌ప్పు దినుసులు కూడా సాగు చేస్తుంటారు. సుమారు కోటి ప‌ది ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌ల‌ను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో అత్య‌ధికంగా వ‌రి 47 ల‌క్ష‌లు, ప‌త్తి 43 ల‌క్ష‌ల ఎక‌రాలు, మిగిలిన ఎక‌రాల్లో మొక్క‌జొన్న‌, ప‌ప్పు దినుసులు సాగు చేస్తున్నారు.

- Advertisement -

వ‌రిలో ఎండాకు తెగుళ్లు

వరి పొలాల్లో నీరు నిలిచి ఉండడంతో బ్యాక్టీరియా పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం వ‌రికి ఎండు ఆకు తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు, దోమపోటు, మోగి తెగుళ్లు సోకాయి. వరి ప్రస్తుతం దుబ్బు దశలో వుంది. దీంతో వరి ఆకులు ఎర్రగా మారి ఎండి పోతున్నాయి. దిగుబడి బాగా తగ్గుతుంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. వర్షాలకు క్షేత్రాల్లో వేసిన ఎరువులు పూర్తిగా కొట్టుకుపోయాయి. మళ్ళీ ఎరువులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది.

ప‌త్తి పంట‌కు ఎరుపు తెగుళ్లు

ప‌త్తి చేతికందికొచ్చే స‌మ‌యంలో వ‌ర్షాలు భారీగా ప‌డ‌డంతో దిగుబ‌డి పూర్తిగా ప‌డిపోతోంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ప‌త్తి పంట పొలాల్లో ఇంకా నీరు నిలిచి ఉండ‌డంతో ఎరుపు తెగుళ్లు, జాజు తెగుళ్లు సోకుతున్నాయి. ప‌త్తి పువ్వు, కాయ‌లు నేల‌కు రాలిపోతున్నాయ‌ని ప‌లువురు రైతులు తెలిపారు. ప‌ది రో్జులుగా ఎండ లేక‌పోవ‌డంతో సుమారు 50 శాతం దిగుబ‌డి త‌గ్గిపోయే అవ‌కాశం ఉంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

మొక్కజొన్నకు భాస్వరం లోపం

మొక్కజొన్న పంట‌కు భాస్వ‌రం లోపంతో మొక్క ఎదుగుద‌ల త‌గ్గిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్క జొన్న‌కు అంత‌ర పంట‌గా ప‌సుపు సాగు చేస్తుంటారు. మొక్క‌జొన్న‌తోపాటు ప‌సుపు పంట‌కు తెగుళ్లు సోకుతున్నాయి. మొక్క‌జొన్న పంట పొలాల్లో నీళ్ళు నిలిచి ఉండడంతో భాస్వరం లోపం ఏర్పడుతుంద‌ని రైతులు చెబుతున్నారు. దీంతో పాటు బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు సోకింది. మొక్కజొన్న ప్రస్తుతం జల్లు కట్టే దశలో వుంది. కొన్ని చోట్ల కంకి దశలో ఉంది. మొదట వేసిన మొక్కజొన్న పచ్చి బుట్టల విక్రయం జరుగుతోంది. దీంతో పాటు పసుపు పంట పాడయ్యే పరిస్థితి నెలకొంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

పప్పు దినుసుల పంటలు నాశనం

పప్పు దినుసుల పంటలు సోయాబీన్‌, వేరుశ‌న‌గ‌, పెసర, కందులు పంట‌లు సాగు చేస్తున్నారు. భారీ వర్షాలతో ఈ పంటలు పూర్తిగా దెబ్బ తింటోంద‌ని రైతులు తెలిపారు. కనీసం గింజలు వచ్చే అవకాశం లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు. నేటికీ పంట నీటిలో మునిగి ఉండ‌డం వ‌ల్ల కాయ‌లు కుళ్లిపోయే అవ‌కాశం ఉందని రైతులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement