హైదరాబాద్ – దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కోవిడ్ నుంచి ఒకరు కోలుకోగా.. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1322 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30 మంది రిపోర్టులు రావాల్సి వుంది.
మరోవైపు.. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ వుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్ష నిర్వహించారు. కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల వంటి వాటిపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వున్న ల్యాబ్‌ల్లో ఒక్కరోజులో 16,500 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగలిగే సామర్ధ్యం వుందని అధికారులు మంత్రికి వివరించారు. మరో 84 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులో వున్నాయని అధికారులు రాజనర్సింహకు తెలిపారు.
అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రోజుకు 4 వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాజిటివ్‌గా నిర్ధారణ అనంతరం బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీడీఎఫ్‌డీ, గాంధీ ఆసుపత్రికి పంపించాలని సూచించారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల లోపే కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని రాజ నర్సింహ ఆదేశించారు.