సిర్పూర్ – యు లో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
ఉత్తరాది నుంచి శీతల గాలుల తాకిడి
ఉదయం వేళ కమ్మేస్తున్న పొగమంచు
వాహనదారులకు తప్పని ఇబ్బందులు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఆదిలాబాద్ బ్యూరో : పది రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలతో ఉపశమనం పొందిన అదిలాబాద్ జిల్లా ప్రజలు కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో మళ్లీ అల్లాడిపోతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ జిల్లాల్లోని 10 మండలాల్లో గురువారం సింగిల్ డిజిట్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. ప్రధాన రహదారులన్నీ దట్టమైన పొగమంచు కమ్మేయగా ప్రయాణికులు.. వాహన చోదకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
చలి గుప్పిట్లో ఏజెన్సీ … సిర్పూర్- యు లో 7.3 డిగ్రీల నమోదు..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కొమురం భీం జిల్లా తిర్యానీ ,కెరమెరి, జై నూర్, నార్నూర్, సిర్పూర్ యు, వాంకిడి ఏజెన్సీ మండలాల్లో సింగిల్ డిజిట్ లోనే అత్యల్పౌష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం సిర్పూర్ – యు లో 7.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ ధరి లో 8.4 డిగ్రీలు, తిర్యాని, బేలలో 8.9 , అర్లిటి, తాంసి, బోరజ్, తలమడుగు, బీంపూర్,ఆదిలాబాద్ అర్బన్, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అస్తమా, దగ్గు చలి జ్వరం పట్టిపీడించే అవకాశం ఉంది. ఉదయం రాత్రి వేళల్లో ప్రయాణం చేయకూడదని, చలి బారి నుండి సుయ రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కాగా మరో 15 రోజులపాటు చలి తీవ్రత ఇదేవిధంగా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.