పెట్రో ధరలు తగ్గించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ బంక్ ల వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేట్టింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సెక్రటేరియట్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ దాసోజు శ్రవణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధ్యక్షతన ఆధ్వర్యంలో పాత బస్టాండ్ పెట్రోల్ పంపు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో గత 14 నెలలుగా కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్రం మాత్రం నిత్యావరస ధరలను పెంచుకుంటుపోతోందని సంపత్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పెరగలేదని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.