Saturday, October 19, 2024

Telangana Congress – వ‌ల‌స నేత‌ల హ‌డావిడిపై భ‌ట్టి గుస్సా….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వలస నేతలు చేస్తున్న హడావిడితో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశముందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రచారం మాటు-న హడావిడి చేస్తూ ఒకరిద్దరు నాయకులు చేస్తున్న ఆర్భాటాలు, ఒం-టె-ద్దు పోకడలతో పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆందోళన ఆ పార్టీ సీనియర్లను వెంటాడుతున్నట్లు- తెలుస్తోంది. ఈ విషయంలో వలస నేత ఏకపక్ష వైఖరిపై సీఎల్పీ నేత, మల్లు భట్టివిక్రమార్క ఒకింత గుర్రుగా ఉన్నట్లు- విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇదే విషయమై పార్టీ వర్గాల నుంచి ఆయన ఆరా తీస్తున్నట్లు- తెలియవచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కార్పొరేట్‌ నేత చేరికతో సరికొత్త జోష్‌ నెలకొన్నప్పటికీ, విభజించి పాలించు అన్న చందాన వర్గాల వారీగా వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు- చేస్తున్నారని, పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం, వ్యక్తి ఆరాధన వంటి అంశాలు కాంగ్రెస్‌ పార్టీకి సరికొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌లో వింత వైఖరి… పీసీసీ మౌనం
సర్వే నిర్వహించి, ప్రజల అభిప్రాయం మేరకే టికెట్లు కేటాయిస్తామంటూ ఏఐసీసీ, పీసీసీ అధిష్టానాలు కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. అయితే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నచందాన వలస నేతల తమ భజన బృందాలతో కలిసి తామే అభ్యర్థులమంటూ ప్రకటించుకొని హడావిడి చేయడం, సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవడం, పార్టీ కోసం సర్వత్యాగాలు చేసిన కాంగ్రెస్‌ శ్రేణులకు ఆగ్రహం కలిగిస్తోంది. పార్టీలో చేరిన వలస నేతలు ఆయా నియోజకవర్గాల్లోని సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలను, పార్టీశ్రేణులను కలుపుకొని పోవడం లేదన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. దీంతో ఏళ్లుగా పార్టీ జెండాను భుజాన వేసుకొని, కాపాడు కుంటూ వస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో బీసీ నేతగా టికెట్‌ను ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణ , ఏఐసీసీ, పీసీసీ అధిష్టాన పెద్దల ఆదేశాలకు లోబడి, అత్యధిక సభ్యత్వాలను చేర్పించడం ద్వారా టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. 1989 నుంచి బీసీ (మున్నూరు కాపు) నియోజక వర్గంగా కొత్తగూడెం కొనసాగుతోంది. గతంలో వనమా వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌ గూటికి చేరిన నాటి నుంచి, ఎడవల్లి పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు తెలియకుండానే పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడంతో పాటు, కనీసం కలుపుకొని పోయే ప్రయత్నాలు చేయకుండానే, వలస కార్పొరేట్‌ నేత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం విమర్శలకు దారితీసింది.

బీసీ నియోజకవర్గంలో ఓసీ నేత అత్యుత్సాహంపై బీసీ సామాజిక వర్గం నేతలు మండిపడు తున్నారు. మరోవైపు సదరు కార్పొరేట్‌ నేతను పార్టీలో చేర్చుకున్నా రన్న మాటే కాని, పార్టీని సమన్వయం చేసేందుకు పీసీసీ ప్రయత్నాలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలో చేరిన సదరు కార్పొరేట్‌ నేత ఏకపక్ష ధోరణితో ప్రచారం చేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ముఖ్య నాయకులు, ఆశావహులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ దిశానిర్దేశం చేసి, అందరూ ఏకతాటిపై ముందుకు సాగేలా చర్యలు తీసుకోక పోవడం కూడా పార్టీలో అంతర్యుద్ధానికి కారణమవుతోంది .

ఉత్సాహం నుంచి ఉసూరుమనిపించేలా..
ఏళ్లుగా పలు నియోజకవర్గాల్లో ఈసారైనా తమకు అవకాశం కలిసి వస్తుందన్న ఆశతో పలువురు నాయకులు పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. తాజాగా భట్టి విక్రమార్క పాదయాత్ర, విజయోత్సవ సభకు రాహుల్‌ గాంధీని జిల్లాకు పిలిపించడం వంటి కార్యక్రమాలతో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ కు దీ-టైన ప్రత్యర్థిగా నిలిచేది గెలిచేది మేమేనంటూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సంబురాలకు సిద్ధమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ పథ కాలు, ధీటైన నాయకులు, క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ నిర్మాణం వంటి అనుకూలమైన అధికార పార్టీ దూసుకుపోతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై నడవాల్సి ఉండగా, విష సంస్కృతిని వెదజల్లేలా సాగుతున్న ఓ వర్గం నేతల వైఖరికి అడ్డుకట్ట పడకపోతే సరైన ప్రత్యర్థిగా సైతం నిలిచే అవకాశం ఉండదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

వ్యక్తి ఆరాధనతోనే ముప్పు.?
కాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తి ఆరాధనకు తావులేదని, కేవలం సోనియా, రాహుల్‌, ప్రియాంక మినహా మిగతా నాయకులెవరైనా పార్టీకి విధేయులుగా పని చేయాల్సిందేనని, కానీ అందుకు భిన్నంగా వలస నేత, ఆయన అనుచరులు ముందుకు సాగుతు న్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పని చేసిన పార్టీని సైతం వ్యక్తి ఆరాధనతో నాశనం చేశారని, కాంగ్రెస్‌లోనూ అదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారంటూ పార్టీ నేతలు కొందరు ఉమ్మడి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న భట్టి విక్రమార్క వద్ద వాపోయినట్లు- సమాచారం. ఈ విషయమై భట్టి విక్రమార్క సైతం గుస్సా అయినట్లు- తెలిసింది. పార్టీలో సమన్వ యం కోసం ప్రయత్నం చేద్దామని, వలస నేతల ప్రచారానికి పీసీసీ ప్రత్యేకంగా ఏమైనా అనుమతి ఇచ్చిందా అన్న విషయమై తనవద్ద స్పష్టమైన సమాచారం లేదని, తెలుసుకుంటానంటూ వారికి నచ్చజెప్పినట్లు- తెలిసింది. నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్న సమావేశాల గురించి, సీఎల్పీ నేతనైన తనకు సైతం సమాచారం లేదని, అసలు ఈ సమావేశాలు ఎందుకని ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో వలస నేతల చేరికతో జరుగుతున్న ఆధిపత్య పోరుతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అంతర్మథనం చెందుతున్నట్లు- తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement